– డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యమంటున్న మంత్రి
– మొక్కుబడి చర్యలేనంటూ బండి సెటైర్స్
– అమ్మేది, వాడేది బీజేపీ, కాంగ్రెసేనంటున్న టీఆర్‌ఎస్
– దమ్ముంటే టెస్టుకు రావాలని రేవంత్ సవాల్
– ఇంత సడెన్ గా డ్రగ్స్ కేసు తెరపైకి ఎందుకొచ్చింది?
– ఐటీ రెయిడ్స్ వార్తల్ని సైలెంట్ చేసేందుకా?
– కరెంట్, ఆర్టీసీ ఛార్జీల పెంపు డైవర్షన్ కా?
– లేక.. షకీల్ కారు ఘటన డ్యామేజ్ ను కవర్ చేసేందుకా?
పార్టీకి గానీ.. తనకు గానీ ఏదైనా ప్రమాదం తలెత్తితే.. డ్రగ్స్ అంశాన్ని తెరపైకి తెస్తారని కేసీఆర్ పై ఆరోపణలు ఉన్నాయి. గతంలో జరిగిన పరిణామాలను బట్టి ఇలా విమర్శలు చేస్తుంటారు ప్రతిపక్ష నేతలు. ప్రస్తుతం రాష్ట్రంలో బంజారాహిల్స్ డ్రగ్స్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో పార్టీ అంటే.. పోలీస్ బాస్ లకు, అధికార పార్టీ లీడర్లకు తెలియకుండానే జరుగుతుందా? అనే అనుమానాలు లేకపోలేదు. అయితే.. ప్రజెంట్ ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.
ర్యాడిసన్ బ్లూ డ్రగ్స్ పార్టీ విషయంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ లో ముంచుతోంది.. కేవలం బీజేపీ, కాంగ్రెస్ నాయకులేనని ఆరోపించారు. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి మేనల్లుడు, బీజేపీ నేత కుమారుడు ఉన్నారన్నారు. దీంతో.. అగ్గి రాజుకుంది. డ్రగ్స్ అంశం చుట్టూ డైలాగ్ వార్ స్టార్ట్ అయ్యింది. డ్రగ్స్ వినియోగంపై కేసీఆర్ కు సవాల్ చేశారు రేవంత్ రెడ్డి. చిన్న పిల్లల్ని అడ్డం పెట్టుకుని తమపై రాజకీయం చేస్తారా..? మా పిల్లలందరినీ టెస్ట్ కు తీసుకొస్తాం.. కేటీఆర్ ను పంపిస్తావా? అంటూ ఛాలెంజ్ విసిరారు. 24 గంటలు పబ్ లకు అనుమతి ఇచ్చిందెవరని కడిగిపారేశారు. పట్టుబడిన 125 మందిని టెస్ట్ చేయకుండా ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.
ఈ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సీఎం సీటు కోసం కేటీఆర్ డాడీ డాడీ అంటుంటే.. కేసీఆర్ ప్యాడీ ప్యాడీ అంటూ ప్రజల దృష్టి మళ్లించేందుకు ధాన్యం పేరుతో డ్రామాలాడుతున్నారని విమర్శలు చేస్తూ.. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోందని మండిపడ్డారు. విచ్చలవిడిగా డ్రగ్స్ దందా కొనసాగుతోందని.. దాని గురించి సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. డ్రగ్స్ విషయంలో కఠిన చర్యలు లేవని.. ఏదో మొక్కుబడిగా మీటింగులు పెట్టి హడావుడి చేయడం తప్ప సమస్యను పరిష్కరించిన దాఖలాల్లేవని విమర్శించారు. ఏదైనా ఇష్యూను దారి మళ్లించడంలో కేసీఆర్ దిట్ట అంటూ సెటైర్లు వేశారు.
బండి వ్యాఖ్యల్లో నిజం ఉందనేది రాజకీయ పండితుల వాదన. ఎందుకంటే.. రాష్ట్రంలో డ్రగ్స్ దందా ఎప్పటినుంచో జోరుగా సాగుతోంది. ర్యాడిసన్ బ్లూ పబ్ ఒక్కటే కాదు.. ఇంకా చాలాచోట్ల ఇలాంటి పార్టీలు జరుగుతున్నాయి. వాటిపై సరైన చర్యలు లేవని అంటున్నారు. ఇప్పుడు ర్యాడిసన్ బ్లూ వ్యవహారం బయటకు రావడం వెనుక కూడా పెద్ద ప్లానే ఉందని విశ్లేషణ చేస్తున్నారు. కేంద్రంతో కయ్యానికి కాలుదువ్వాక.. కేసీఆర్ ను ఢిల్లీ పెద్దలు టార్గెట్ చేశారని.. ఆయన ఆర్థిక మూలాలపై దృష్టి పెట్టారని అంటున్నారు. అందులోభాగంగానే కొద్దిరోజుల క్రితం ఐటీ రెయిడ్స్ జరిగాయని గుర్తు చేస్తున్నారు.
అసలే నిత్యావసరాల ధరలతో సామాన్యుడికి చుక్కలు కనపడుతుంటే.. కరెంట్, ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకుంది కేసీఆర్ ప్రభుత్వం. ఈ విషయంలో ప్రజల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే ఎమ్మెల్యే షకీల్ కారు వ్యవహారం కూడా టీఆర్‌ఎస్ కు డ్యామేజ్ ను తెచ్చిపెట్టింది. తమకు సంబంధం లేదని ఎమ్మెల్యే ముందుగా ప్రకటించడం.. బాధితురాలికి డబ్బులిచ్చి పంపించడం.. తర్వాత ఎమ్మెల్యే కుమారుడు కారులోనే ఉన్నాడని తెలియడం.. ఇలా ఈ ఇష్యూ గులాబీ పార్టీకి తలనొప్పిగా మారింది.
కొద్దిరోజులుగా రాష్ట్రంలో ఈ విషయాల గురించే చర్చ జరుగుతోంది. నిజానికి ఈ అంశాల్లో ప్రజా వ్యతిరేకత అనేది కామనే. కానీ.. అక్కడుంది ఎవరు. ఏదైనా డ్యామేజ్ జరుగుతుంటే దాన్ని క్షణాల్లో డైవర్ట్ చేయడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అని చెబుతుంటారు విశ్లేషకులు. ఈ క్రమంలోనే డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చిందని అనుమానిస్తున్నారు. పైగా విషయం బయటకు వచ్చాక.. చాలామందిని టెస్టులు చేయకుండా వదిలేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గులాబీ నేతలు ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేయడం.. అవతలి పార్టీలు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తుండడం.. ఇవన్నీ అసలు విషయాలను దాచిపెట్టడానికేననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.