కరోనా వైరస్ ప్రభావం రాష్ట్రంలో రోజు రోజుకు వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు కేవలం జీహెచ్ఎంసీ, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు పరిమితమైన ఈ వైరస్ ఇప్పుడు నిజమాబాద్ కు పాకినట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు జనతా కర్ఫ్యూ విధించి, ఆ వెంటనే లాక్ డౌన్ విధించి నేటికి వారం పూర్తవుతుంది. కానీ కరోనా కేసులు తగ్గకపోగా… మరింత పెరుగుతున్నాయి. దీంతో సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలోని ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వైద్యాధికారులు, వ్యవసాయ-సివిల్ సప్లై అధికారులతో సాయంత్రం 5గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, జనం ఇబ్బందులు ఎలా పరిష్కారించాలి, కరోనా వైరస్ వ్యాప్తి రాష్ట్రవ్యాప్తంగా ఎలా ఉందన్న అంశాలతో పాటు లాక్ డౌన్ అమలుపై మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలనే అంశంపై ఈ భేటీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 70కి చేరువలో ఉంది. ఒకరు డిశ్చార్జి అయి వెళ్లిపోగా, ఒకరు కరోనా వైరస్ కారణంగా మరణించారు. దీంతో జీహెచ్ఎంసీ సహా పట్టణ ప్రాంతాల్లో మరిన్ని కఠిన చర్యలు తీసుకోవటంతో పాటు సీఎం కేసీఆర్ ప్రకటించిన ఫ్రీ రేషన్, 1500రూపాయల ఆర్థిక సహాయంపై కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది.