సమజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ములాయం సింగ్ యాదవ్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరా తీశారు. స్వయంగా ములాయం తనయుడు, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌కు ఫోన్ చేశారు సీఎం కేసీఆర్. అఖిలేశ్‌తో మాట్లాడి ములాయం యోగ క్షేమాలను గురించి అడిగి తెలుసుకున్నారు. దసరా పండుగ తర్వాత స్వయంగా వచ్చి కలుస్తానని ఈ సందర్భంగా అఖిలేశ్ యాదవ్‌కు సీఎం కేసీఆర్ తెలిపారు.
ప్రస్తుతం ములాయం సింగ్ యాదవ్ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. 82 ఏళ్ల ములాయం కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆగస్టు 22 నుంచి గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రాత్రి ములాయం ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆంకాలజిస్టులు డాక్టర్ నితిన్ సూద్, డాక్టర్ సుశీల్ కటారియాల ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ములాయం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన కుమారుడు, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆసుపత్రికి చేరుకున్నారు. ములాయం మూత్రనాళ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారనీ, దానికి తోడు వయస్సుతో పాటు వచ్చే అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయనీ డాక్టర్లు తెలిపారు.
కాగా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ములాయం మూడు సార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా కూడా ఆయన పని చేశారు. ప్రస్తుతం మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నారు. నేతాజీ అని పిలవబడే ములాయం యాదవ్.. తొలిసారిగా 1967లో ఉత్తరప్రదేశ్ శాసనసభలో శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు.