హుజూరాబాద్ లో ఈటలను ఓడించాలి.. ఏం చేద్దాం..? నియోజకవర్గంలో దళిత ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. దళిత బంధు అని ఓ పథకాన్ని తెచ్చి గెలిచేద్దాం.. ఆ పథకాన్ని ప్రవేశపెట్టక ముందు కేసీఆర్ ఆలోచన ఇదే అయి ఉండొచ్చు. ఎందుకంటే హుజూరాబాద్ లో గెలుపు రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. అందుకే ఎలాగైనా గెలవాలని పావులు కదుపుతున్నారు కేసీఆర్. ఈ క్రమంలోనే దళిత బంధు పథకాన్ని తెచ్చారు. అయినా ఆయనలో ఓటమి భయం కనిపిస్తున్నట్లుగా అనిపిస్తోంది.
దళిత బంధు పైలట్ ప్రాజెక్ట్ ను హుజూరాబాద్ లో అమలు చేస్తూ.. ఇతర నియోజకవర్గాల నుంచి జానాన్ని తరలించి.. సక్సెస్ చేసుకున్నా ఆశించిన స్థాయిలో టీఆర్ఎస్ గ్రాఫ్ పెరగలేదనే ఆందోళన కేసీఆర్ లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. శుక్రవారం ప్రగతిభవన్ లో హుజూరాబాద్ ఇంచార్జ్ లతో అర్ధరాత్రి వరకు నిర్వహించిన సమావేశమే ఇందుకు నిదర్శనం. పెద్ద సార్ పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినా తనలో ఉన్న భయాన్ని మాటల రూపంలో బయటపెట్టారని భేటీకి హాజరైన కొందరు నాయకులు చెవులు కొరుక్కుంటున్నట్లు సమాచారం.
ఈటల వెనుకున్న నాయకులందరినీ పార్టీలోకి తెచ్చినా.. ఆఘమేఘాల మీద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా.. కుల సంఘాల భవనాల నిర్మాణం కోసం అన్ని మండలాల్లో, మున్సిపాల్టీల్లో, మేజర్ గ్రామపంచాయతీల్లో స్థలాలు కేటాయించి నిధులు మంజూరు చేసినా.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చినా.. మండలాల వారీగా ఇంచార్జ్ లను కేటాయించి గడపగడపకీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నా… గొర్రెల పంపిణీ, రైతు రుణమాఫీ, మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాలు మంజూరు చేసినా.. ఈటలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నా… ఇలా అన్ని రకాలుగా సామ దాన దండోపాయాలు ప్రదర్శించి పనిచేస్తున్నా టీఆర్ఎస్ గ్రాఫ్ ఎందుకు పెరగడం లేదనే ఆందోళన కేసీఆర్ ను వెంటాడుతోందని… దానివల్ల ఆయన నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇటు ఇంచార్జ్ లు పెద్దసారు అనవసరంగా హుజూరాబాద్ ఉప ఎన్నికను హైప్ చేస్తున్నారని చెవులు కొరుక్కుంటున్నారు.
ఇప్పటి దాకా అనేక ఉప ఎన్నికలు జరిగాయి. ఎప్పుడూ పెద్ద సార్ ఇంత సీరియస్ గా తీసుకోలేదు. కానీ.. హుజూరాబాద్ ను మాత్రం మినిట్ టూ మినిట్ మానిటరింగ్ చేయడంతో ఆయనలో ఓడిపోతున్నామనే భయం కనపడుతోందని ప్రతిపక్షాలు మాట్లాడుకునే అవకాశం మనమే ఇస్తున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇంచార్జ్ లు. మనం ఏం చేసినా ఈటలకు సానుభూతి పెరిగేలా ఉంది తప్ప.. ఆయన గ్రాఫ్ తగ్గేలా లేదని చర్చించుకుంటున్నారు. ఎన్ని కుట్రలు చేస్తే అంత ఈటలకు కలిసి వస్తుందని… ఇప్పటికైనా పెద్ద సార్ దీన్ని ప్రతిష్టగా భావించకుండా హరీష్ కే పూర్తి బాధ్యత ఇచ్చి వదిలేస్తే.. గెలుస్తే గెలుస్తా.. లేకపోతే లేదని అంటున్నారు. దుబ్బాకలో ఓడిపోతే కొంపలు మునగలేదుగా అని గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత సాగర్ లో, గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం అన్ని మున్సిపాల్టీల్లో మనమే గెలిచామని చెబుతున్నారు. అలాంటిది ఇప్పుడు హుజూరాబాద్ లో ఓడిపోతే మొత్తం పార్టీ మునిగిపోయేలా కేసీఆర్ చేయడం టీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్ కి నష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.