దేశంలో త్వరలో రైతుల తుపాన్ రాబోతోందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. దాన్ని ఎవరూ ఆపలేరని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ఇచ్చినట్లు మహారాష్ట్ర రైతులకు కూడా 24 గంటల విద్యుత్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణా, గోదావరి నదులు మహారాష్ట్రలోనే పుడుతున్నా రైతులకు ఎందుకు మేలు జరగట్లేదని ఆయన ప్రశ్నించారు.
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా లోహ పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. కేసీఆర్‌కు ఇక్కడేం పని అని మాజీ సీఎం ఫడ్నవీస్ అడుగుతున్నారని ఆయన చెప్పారు. తెలంగాణలో రైతు బంధు, 24 గంటల కరంట్ అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో రైతు బీమా ఇస్తున్నామని, పూర్తిగా పంట కొంటున్నామని వెల్లడించారు. తెలంగాణ తరహా అభివృద్ధి ఫడ్నవీస్ చేస్తే తాను మహారాష్ట్ర రాబోనని ప్రకటిస్తున్నట్టు చెప్పారు. మహారాష్ట్రలో దళితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఇచ్చినట్లు మహారాష్ట్రలోనూ ప్రతి ఎకరానికి ఏటా రూ.10 వేలు ఇవ్వాలన్నారు. తెలంగాణలో ఇచ్చినట్లు రైతులకు 24 గంటల విద్యుత్ ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ 54 ఏళ్లు, భాజపా 14 ఏళ్ల దేశాన్ని పాలించాయన్నారు. ఆ పార్టీలు దేశానికి ఏం చేశాయి..?అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, బీజేపీలతో మన బతుకులు మారాయా..? అంటూ ఆయన మండిపడ్డారు.
అమెరికా, చైనా కంటే నాణ్యమైన భూమి మనకు ఉందని పేర్కొన్నారు. ఏటా 50 వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందన్నారు. నేతలు తలచుకుంటే దేశంలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వొచ్చని చెప్పారు. దేశంలో సమృద్ధిగా సహజ వనరులు ఉన్నాయని వివరించారు.
దేశంలో 360 బిలియన్ టన్నుల బొగ్గు ఉందన్నారు. దేశంలో ఉన్న బొగ్గుతో 24గంటల విద్యుత్ సులభంగా ఇవ్వొచ్చన్నారు. పీఎం కిసాన్ కింద కేంద్రం కేవలం రూ.6 వేలు మాత్రమే ఇస్తోందన్నారు. పీఎం కిసాన్ కింద రైతులకు కనీసం రూ.10 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
తాము నాందేడ్ లో అడుగు పెట్టగానే రైతుల ఖాతాల్లో రూ. 6వేలు వేశారన్నారు. దీంతో బీఆర్ఎస్ సభ సత్తా ఏంటో అర్థమైంది కదా అని ఆయన అడిగారు. బీఆర్ఎస్ పార్టీని మహారాష్ట్రలోనూ రిజిస్టర్ చేయించామన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పోటీ చేస్తామన్నారు.
ప్రతి జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగరాలన్నారు. ఫసల్ బీమా యోజన డబ్బు మీలో ఎవరికైనా అందిందా? అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ను గెలిపిస్తే రైతుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. తమ ప్రాంతంలో సభ పెట్టాలని మహారాష్ట్రలో పలు ప్రాంతాల్లో విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు.