– రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏపీకి ఇచ్చారు?
– ఏడేళ్లుగా ఏం అడుగుతున్నా ఇవ్వడం లేదు
– ఫెడరల్ వ్యవస్థ అంటే ఇదేనా?
– చట్టసభలు నడిచే ధోరణిపై చర్చ జరగాలి
– మన్మోహన్ పాలనతో పోలిస్తే..
– మోడీ హయాంలో దేశం ఘోరంగా దెబ్బతిన్నది
– 8 ఏళ్లలో 20 లక్షల మంది పౌరసత్వం వదులుకున్నారు
– అదానీ గురించి అడుగుతుంటే ప్రధాని మౌనమెందుకు?
– మోడీ పాలనలో వృద్ధి రేటు దిగజారింది
– నా లెక్కలు తప్పని తేలితే రాజీనామాకు సిద్ధం
– అసెంబ్లీలో కేంద్రంపై మండిపడ్డ కేసీఆర్
ఏమీ చేయం.. ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు సీఎం కేసీఆర్. తెలంగాణ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.473 కోట్లను ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చారని అన్నారు. తమ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వాలని ఏడేళ్లుగా కేంద్రప్రభుత్వాన్ని అడుగుతున్నామని చెప్పారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేశారని.. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే రాష్ట్రానికి ఒక్కటి కూడా రాలేదని మండిపడ్డారు. ఫెడరల్ వ్యవస్థ అంటే ఇదేనా? అని ప్రశ్నించారు.
దేశరాజధాని ఢిల్లీలోనూ తాగునీటికి దిక్కులేదన్న కేసీఆర్.. రత్నగర్భలాంటి దేశంలో కనీస అవసరాలు తీరడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అమెరికాలో గ్రీన్ కార్డు వస్తే పండుగ చేసుకునే పరిస్థితి నెలకొందని అన్నారు. చట్టసభల్లో ప్రజాసమస్యలపై చర్చలు జరగాలని.. కానీ, ఇటీవల పెడ ధోరణులు పెరుగుతున్నాయని చెప్పారు కేసీఆర్. పార్లమెంటులోనూ అవాంఛనీయ ధోరణులు ఉన్నాయన్నారు. చట్టసభలు నడిచే ధోరణిపై చర్చ జరగాలని తెలిపారు. ఈటల రాజేందర్ ప్రస్తావించిన వాటిని పరిష్కరిస్తామన్న సీఎం.. సమస్యలపై ఎవరు చెప్పినా సానుకూలంగా స్పందిస్తామని చెప్పారు.
8 ఏళ్లలో 20 లక్షల మంది భారతీయ పౌరసత్వం వదులుకున్నారని.. ఇంతటి దౌర్భాగ్యం ఎందుకని ప్రశ్నించారు కేసీఆర్. ఎన్నికల్లో పార్టీలు, నేతలు గెలుస్తున్నారు.. కానీ, ప్రజలు ఓడిపోతున్నారని చెప్పారు. మన్మోహన్ సింగ్ మంచి వ్యక్తి.. పని ఎక్కువ.. ప్రచారం తక్కువగా చేశారని గుర్తు చేశారు. మోడీ కంటే ఆయన ఎక్కువ మంచి పనులు చేశారని కొనియాడారు. మన్మోహన్, మోడీ పాలనపై పూజామెహ్రా ‘ది లాస్ట్ డెకేడ్’ పుస్తకం రాశారని వివరించారు. మన్మోహన్ పాలనతో పోలిస్తే మోడీ హయాంలో దేశం ఘోరంగా దెబ్బతిన్నదని వ్యాఖ్యానించారు.
పార్లమెంట్ లో ప్రధాని మోడీ ప్రసంగంలో అదానీ ప్రస్తావన ఎందుకు రాలేదని ప్రశ్నించారు కేసీఆర్. ఈ వ్యవహారంపై ది ఎకానమిస్ట్ పత్రికలో కథనం వచ్చిందని.. హిండెన్ బర్గ్ లేవనెత్తిన అంశంపై మోడీ వివరణ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. అదానీ అంశంపై ఢిల్లీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నాయని.. రాష్ట్రంలోనూ ఆ కంపెనీ పెడతామన్నారు.. పెట్టలేదు.. మనం బతికిపోయామని చెప్పారు. 60, 40 ఏళ్ల కిందటి నెహ్రూ, ఇందిరా పాలనను మోడీ విమర్శిస్తున్నారని.. అదానీ విషయం గురించి అడుగుతుంటే మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు కేసీఆర్.
మోడీ డాక్యుమెంటరీపైనా అసెంబ్లీలో ప్రస్తావించారు కేసీఆర్. బీబీసీని భారత్ లో బ్యాన్ చేయాలన్న బీజేపీ నాయకులపై విరుచుకుపడ్డారు. దాన్ని బ్యాన్ చేయాలని బీజేపీకి చెందిన లాయర్ సుప్రీంకోర్టులో కేసు వేశారని వివరించారు. బీబీసీ అంటే జీ న్యూసా ఈడీ దాడులు చేయగానే బంద్ చేయడానికి అని విమర్శించారు. గోద్రా అల్లర్లపై డాక్యుమెంటరీ చేస్తే బీజేసీని బ్యాన్ చేస్తారా అని ప్రశ్నించారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైల్లో రూమ్ రెడీ చేశామని అంటారా? ఇది పద్దతేనా? అని అసహనం వ్యక్తం చేశారు. మోడీ పాలనలో దేశం బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక కంటే వెనుకబడి పోయిందని విమర్శించారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో నడిపితే మోడీ సర్వనాశనం చేశారని ఆరోపించారు. 2024 తర్వాత బీజేపీ ఖతమని జోస్యం చెప్పారు సీఎం కేసీఆర్.
మోడీ హయాంలో ఏ రంగంలోనూ వృద్ధి జరగలేదని విమర్శించారు కేసీఆర్. కాంగ్రెస్ పాలనలో వార్షిక వృద్ధి రేటు 6.8 కాగా.. మోడీ వచ్చాక 5.8కి పడిపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో తలసరి ఆదాయం వృద్ధిరేటు 12.7 ఉండగా, మోడీ హయాంలో 7.1 ఉందని సగానికి సగం పడిపోయిందని మండిపడ్డారు. ప్రధానికి ఓట్లు కావాలంటే బియ్యం ఫ్రీ అంటారని.. మేకిన్ ఇండియా జోకిన్ ఇండియాగా మారిందని విమర్శించారు. తాను చెప్పిన లెక్కల్లో ఒక్క అబద్ధం ఉన్నా రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. తన మాటకు కట్టుబడి ఉంటానని, అభివృద్ధిపై మాట్లాడే హక్కు మోడీకి లేదని విమర్శించారు. దేశంలో అత్యంత విఫలమైన ప్రధాని మోడీయే అని చెప్పారు కేసీఆర్.