కేసీఆర్ తన మంత్రివర్గ సహాచరులకు క్లాస్ తీసుకున్నారా..? ఇంత గొడవ నడుస్తుంటే మీరెందుకు సైలెంట్‌గా ఉన్నారు…? విషయం పెద్దది కాకముందే ఎదురుదాడి మొదలుపెట్టాలని తెలియదా..? అంటూ క్లాస్ తీసుకున్నారా..? అందుకే సడెన్‌గా కేసీఆర్‌తో సాన్నిహిత్యం ఉండే మంత్రులు విమర్శలు చేస్తున్నారా…?
ఆర్టీసీ అంశంలో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వైఖరిపై విమర్శల దాడి తీవ్రతరం అవుతోంది. అగ్గికి ఆజ్యం తోడైనట్లు ‘సెల్ఫ్ డిస్మిస్ చేసుకున్నారు, ఇక వారి పని అంతే…’ అంటూ విమర్శలు చేయటంతో కార్మికలోకం మండిపడుతోంది. ప్రతిపక్ష పార్టీల నేతలు కేసీఆర్, ఆయన కుటుంబం టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. కానీ అధికార పార్టీ తరుపున ఒక్కరంటే ఒక్కరు కూడా నోరు విప్పలేదు. ప్రతిపక్ష నేతలకు, కార్మిక సంఘాల నేతలకు కౌంటర్ ఇచ్చేందుకు సుముఖత చూపలేదు. తాము ఒక్కమాట అన్నా తమకే నష్టం అనుకొని చూసీ చూడనట్లు వదిలేశారు.
కానీ, ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేస్తుంటే మీరు సైలెంట్‌గా ఉంటే ఎలా, సీనీయర్ లీడర్లు అయ్యుండి మీరు కూడ పట్టించుకోకుంటే ఎలా…? అంటూ కేసీఆర్ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే విజయదశమి రోజు, తెలంగాణలో పెద్ద పండగ దసరా నాడు అని కూడా చూడకుండా మంత్రులు ఆర్టీసీ కార్మికులపై ఎదురుదాడి ప్రారంభించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్‌రెడ్డి ఓకే రకమైన స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులు ప్రతిపక్షాల ఉచ్చులో పడవద్దని, గొంతెమ్మ కోరికలు కోరవద్దంటూ హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీ పాలించే రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా అంటూ ప్రశ్నిస్తున్నారు. కార్మిక నేతల ఉచ్చులో కార్మికులు పడవద్దని… ప్రతిపక్షాలు, యూనియన్ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు.
దీంతో… కేసీఆర్, గులాబీ అధిష్టానం సూచించినందునే కేసీఆర్‌కు క్లోజ్‌గా ఉండే మంత్రులు యూనియన్ లీడర్లు, ప్రతిపక్షాలే టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారని, నిన్నటి వరకు మౌనంగా ఉండటంపై కేసీఆర్ క్లాస్ తీసుకొని ఉంటారని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. రేపటి నుంచి చిన్న చితక లీడర్లు కూడా ఇక ఎదురుదాడి చేయటం మొదలు పెడతారని, ఇదంతా కేసీఆర్ క్లాస్‌తోనే షురూ అవుతుందని అంచనా వేస్తున్నారు.