కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. దేశంలో ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు చెడు కాలం దాపురించిందన్నారు. మోడీ పాలన ఎమర్జెన్సిని మించిపోతోందని ఆయన మండిపడ్డారు.
ప్రధాని నరేంద్ర మోడీ దురహంకారానికి. నియంతృత్వానికి ఇది పరాకాష్ట అని అన్నారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిదినం అని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులను వేధించడం పరిపాటిగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేరస్తులు, దగాకోరుల కోసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి ప్రధాని మోడీ తన పతనాన్ని తానే కొనితెచ్చుకుంటున్నారని ఫైర్ అయ్యారు. రాజకీయ పార్టీల మధ్య వుండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాదని తెలిపారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్య వాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలని కోరారు.
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటించడం రాజ్యాంగాన్ని తప్పుగా అర్థం చేసుకోవడమేనని ఆయన అన్నారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు అప్రజాస్వామికమని ఆయన పేర్కొన్నారు.