తెలంగాణలో విశ్వవిద్యాలయాల ఉప కులపతుల నియామకంపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. వీసీల నియమాపకంపై ఆయన సంబంధిత అధికారులతో బుధవారం సుదీర్ఘంగా చర్చించారు. వీసీలను నియమించేందుకు సెర్చ్ కమిటీ నుంచి పేర్లు తెప్పించుకొని ముందుగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) మెంబర్ల నియామకాలు చేపట్టాలని కేసీఆర్ ఆదేశించారు. ఈ ప్రక్రియ అంత రెండు, మూడు వారాల్లోనే పూర్తి కావాలని సీఎం ఆదేశించినట్టు సీఎం కార్యాలయం ట్వీట్ చేసింది.
కొంతకాలంగా రాష్ట్రంలో వీసీల నియామకం వాయిదా పడుతూనే వస్తోంది. గత ఏడాది అక్టోబర్ లో వీసీలను నియమిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చెప్పారు. అలాగే రాష్ట్రంలోని వర్సిటీల్లో అధ్యాపకుల నియామకాలు చేపడుతామని తెలిపారు. ఈక్రమంలోనే సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులతో సమావేశమై వర్సిటీలకు ఉప కులపతులను నియమించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.