సీఎం కేసీఆర్ దళిత బంధు అంటూ టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యేక ఓట్ బ్యాంకు ఏర్పాటుపై దృష్టిపెట్టినట్లు కనపడుతుంది. ఇన్నాళ్లుగా టీఆర్ఎస్ కు ఉద్యమ నేపథ్యం, తెలంగాణ తెచ్చిన సానుభూతి మాత్రమే ఉంది. కానీ 10 సంవత్సరాల పాలన తర్వాత ప్రభుత్వంపై సహజంగానే వ్యతిరేకత ఏర్పడుతుంది.
ఇలాంటి సమయంలో టీఆర్ఎస్ కు బలమైన ఓట్ బ్యాంక్ కోసమే కేసీఆర్ దళిత బంధు తెచ్చినట్లు విశ్లేషకులంటున్నారు. పోనీ దళిత బంధు వెంటనే అందరికీ పడుతుందా…? అంటే దశలవారీగా అందరికీ అంటూ కేసీఆర్ పదే పదే చెప్తూ వచ్చారు. ఆర్నేళ్ల క్రితం ఈ బడ్జెట్ లో పాఠశాలల అభివృద్ధి కోసం 4వేల కోట్లు ఖర్చు చేస్తామని ఇప్పటి వరకు రూపాయి ఖర్చు చేసిన దాఖలాలు లేవు. పైగా గతంలో దశల వారీగా దళితులందరికీ మూడు ఎకరాల భూమి అన్న హామీ ఎటు పోయిందో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా కేసీఆర్ విషయంలో ఆయన ఈనాడు చెప్పిన మాట రేపు కట్టుబడి ఉంటారా అని నమ్మకంగా చెప్పలేం. ఇందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి.
కానీ దళిత బంధు పేరుతో కేసీఆర్ చేస్తున్న హాడావిడితో ఇతర కులాల్లో పేదలకు తమకెందుకు ఇవ్వరు అన్న ప్రశ్న రేకెత్తిస్తుంది. వారంతా ఇప్పుడు కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. హుజురాబాద్ లోనూ ఈ ప్రశ్నలు టీఆర్ఎస్ నేతలకు ఎదురవుతున్నాయి. సార్… మేం కూడా లేనొళ్లమే. మాకు ఎందుకు 10లక్షలు ఇవ్వరు అని మంత్రి హరీష్ ను ఓ హమాలీ అడిగిన వీడియో ఇప్పటికే వైరల్ అయ్యింది.
దీంతో బీసీ కులాలతో చెడితే మొదటికే మోసం వస్తుందని గ్రహించిన కేసీఆర్… దళితుల్లో అందరికీ ఇచ్చాక ఇతర కులాల్లో పేదలకు కూడా ఇస్తామని ప్రకటించారు. అసలు దళితులకు ఎప్పటి వరకు ఇస్తారో టైం ఫ్రేమ్ లేదు. నిజంగానే చిత్తశుద్ధితో ఇచ్చినా వచ్చే అసెంబ్లీ ఎన్నికలు పూర్తవుతాయి. ఆ తర్వాత కేసీఆర్ ఇచ్చినట్లు… ఇతర కులాల పేదలు తీసుకున్నట్లు అంటూ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.