హుజురాబాద్‌లో ఉప ఎన్నికల వేళ.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కరీంనగర్ జిల్లాపై సీరియస్‌గా దృష్టిసారించింది. కరోనా కేసులను అదుపులో ఉంచడతో పాటు టీకా పంపిణీలో వేగం పెంచాలని నిర్ణయించింది. అత్యంత ప్రాధాన్యతాంశంగా దీన్ని తీసుకుంది. ఆగస్టు 5న హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా సీనియర్ ఆఫీసర్ల బృందం కరీంనగర్ జిల్లాకు వచ్చి ఈ మేరకు పరిస్థితిని సమీక్షించింది. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్ రెడ్డితో పాటు స్పెషల్ డ్యూటీ అధికారులు ఈ బృందంలో ఉన్నారు.
కరీంనగర్ జిల్లాలో కరోనా వైరస్ కేసులు అధికంగా ఉండటంతో.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా తమను ఇక్కడకు పంపినట్టుగా బృందం వెల్లడించింది. కరీంనగర్ జిల్లాలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను భారీగా పెంచాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపింది. అలాగే టీకాల లభ్యతను బట్టి.. త్వరలో వ్యాక్సినేషన్‌ను కూడా గ్రామస్థాయిలో చేపట్టాలని భావిస్తున్నట్టుగా చెప్పింది. మరోవైపు హుజురాబాద్‌కు సంబంధించి ఇప్పటికే 50 శాతం మందికి మొదటి డోసు వేసినట్టుగా జిల్లా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత కరీంనగర్, వరంగల్ అర్బన్ జిల్లాలోనే అధికంగా కేసులు నమోదవుతున్నాయని, అవి రెండూ కూడా హుజురాబాద్ పక్కనే ఉండటంతో.. ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని వారు వివరించారు
కరీంనగర్ జిల్లాలో రోజూ 9వేల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర అధికారుల బృందం జిల్లా యంత్రాగానికి సూచించింది. అలాగే ఎవరైనా కరోనా బారినపడినట్టు తేలితే.. 20 మంది కాంటాక్ట్‌లను గుర్తించాలని ఆదేశించింది.