దళిత బంధు ప్రారంభోత్సవ సభపై హుజూరాబాద్ వాసుల స్పందనేంటి..? ఇతర నియోజకవర్గాల ప్రజలను సభకు రప్పించడంపై వారేమంటున్నారు..? ఇన్నాళ్లు దళితులకు ఏం చేయని కేసీఆర్.. ఇప్పుడు అమిత ప్రేమ చూపించడం వెనుక ఆంతర్యం వారికి అర్థమైందా..? ఇదంతా కేసీఆర్ కపట ప్రేమగానే వారు భావిస్తున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
సభ పేరుతో కేసీఆర్ అనుచరగణం తమపై దండయాత్ర చేసిందని మండిపడుతున్నారు హుజూరాబాద్ ప్రజలు. బయటి నుంచి జనాన్ని తీసుకొచ్చి తమ దగ్గర సభ పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ సభకు తాము హాజరవ్వమని కేసీఆర్ ముందే గ్రహించి… తన పరువు కాపాడుకోడానికి బయటివారిని పెద్దఎత్తున తీసుకొచ్చారని అంటున్నారు. ప్రతీ నియోజకవర్గం నుంచి 500 మందికి తగ్గకుండా జనాన్ని తీసుకుని రావాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా.. స్వయంగా వారిని కూడా సభకు రావాలని కేసీఆర్ హుకూం జారీ చేశారని చెబుతున్నారు.
ఈటలను మత్రివర్గం నుంచి అన్యాయంగా బర్తరఫ్ చేశారనే భావనలోనే తాము ఉన్నామంటున్నారు హుజూరాబాద్ ప్రజలు. కేసీఆర్ పై తమకు విశ్వాసం లేదని ఖరాకండీగా చెబుతున్నారు. దళిత బంధు పేరుతో ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఇస్తానని ఆయన చెప్పినా నమ్మకం కలగడం లేదని అంటున్నారు. దీనికి కొన్ని విషయాలను కూడా వారు గుర్తుచేస్తున్నారు. దళితుడ్ని సీఎం చేస్తానని చేయలేదు.. మూడు ఎకరాలు ఇస్తానని ఇవ్వలేదు.. డబుల్ బెడ్ రూం ఇళ్లు అని ఏం చేయలేదు.. ఎస్టీ, ఎస్టీ నిధులను సరిగ్గా వాడలేదు.. ఇలా ఇంతకాలం పట్టించుకోకుండా.. ఇప్పుడు ఉద్ధరిస్తామంటే నమ్మాలా అని ప్రశ్నిస్తున్నారు. పైగా.. తమమీద కేసీఆర్ కు విశ్వాసం ఉండి ఉంటే బయట నుంచి పెద్ద ఎత్తున ప్రజలను తెచ్చుకోవాల్సిన అవసరం ఉండేది కాదని అంటున్నారు.
ఈ సందర్భంగా ఈటలతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తున్నారు హుజూరాబాద్ వాసులు. ఈటల తమని అమితంగా ప్రేమించారని.. ఏ ఆపద వచ్చినా, ఎలాంటి సాయం కావాలన్నా అప్పటికప్పుడు స్పందించే మంచి గుణం ఉన్న నాయకుడని అంటున్నారు. పార్టీలకు అతీతంగా ఈటల సాయం అందించారని కొనియాడుతున్నారు. మండలానికో మంత్రి, ఎమ్మెల్యే వచ్చి ఈటలను ఓడించడానికి కష్టపడుతున్నారని.. అయినా వారి ఎత్తుగడలు పనిచేయవని చెబుతున్నారు. తమ మీద నమ్మకం ఉంటే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామస్థాయి నాయకులను లక్షలు, కోట్లతో ప్రలోభాలు పెట్టి టీఆర్ఎస్ లో ఎందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు.
తామందరం ఈటలతో ఉన్నామని కేసీఆర్ కు అర్థమైందని.. ఆ భయంతోనే హడావుడిగా పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని.. ఎవరికి ఏది కావాలంటే అది ఇస్తున్నారని.. అయినా కూడా కేసీఆర్ మీద నమ్మకం కలగడం లేదని చెప్పుకొస్తున్నారు హుజూరాబాద్ ప్రజలు. సీఎం నిర్వహించిన సభ దళిత బంధు సభలా లేదని.. అది ఈటల మీద, తమమీద దండయాత్రలా ఉందని అంటున్నారు. దళిత బంధు అందరికీ వస్తుందనే నమ్మకం లేదంటూనే.. మిగిలిన సామాజికవర్గాల్లో నిరుపేదలు కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నియోజకవర్గం అంతటా ఇదే చర్చ సాగుతోందని వివరిస్తున్నారు హుజూరాబాద్ వాసులు.