దేశంలోనే ఆదర్శవంతమైన పథకాలు.. సుపరిపాలన.. బంగారు తెలంగాణ అంటూ డబ్బాలు కొట్టుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు షాకిచ్చారు. కేసీఆర్ వన్నీ మాయ మాటలు.. మ్యాజిక్కులేనని తేల్చి చెప్పేశారు. ఇప్పటిదాకా ఇచ్చిన హామీలు.. అమలయిన తీరును బేరేజు వేసుకుని సారు కుర్చీ షేక్ అయ్యేలా తమ నిర్ణయాన్ని తెలియజేశారు. దేశంలో నెంబర్ వన్ సీఎం ఎవరో తెలుసుకునేందుకు ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ అనే పేరుతో సర్వే నిర్వహించింది. టాప్ 10 సీఎంల లిస్టును ప్రకటించింది. ఈ జాబితాలో తెలంగాణ సీఎం జాడ ఎక్కడా లేదు. దీన్నిబట్టి కేసీఆర్ గ్రాఫ్ పడిపోయిందని ప్రతిపక్షాలు, మేధావులు చెబుతున్నది నిజమైందని అంటున్నారు విశ్లేషకులు.
దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో జూలై 10 నుంచి 20 వరకు ఈ సర్వే నిర్వహించారు. 71శాతం గ్రామీణ ప్రాంతాలు, 29శాతం పట్టణ ప్రాంతాల్లో వివరాలు సేకరించారు. గతంలో ప్రజాదరణ ఉన్న సీఎంల జాబితాలో ముందున్న కేసీఆర్ ప్రస్తుతం ఎక్కడా కనిపించలేదు. టాప్ 10లో తమిళనాడు సీఎం స్టాలిన్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. రెండో స్థానంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, మూడో ప్లేస్ లో కేరళ సీఎం పినరయి విజయన్, నాలుగులో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, యూపీ సీఎం యోగి, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ ఉన్నారు.
కేసీఆర్ గ్రాఫ్ పడిపోడానికి కారణాలేంటని అన్వేషిస్తే.. ఎన్నో చెబుతున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య వెంటాడుతోంది. రాష్ట్రంలో నిరుద్యోగులు పెరిగిపోయారు. నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని ప్రభుత్వంపై రగిలిపోతున్నారు. నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో తీవ్రంగా ఉందని సర్వేలో తేలింది. అలాగే ధరల పెరుగుదలపై వ్యతిరేకత ఉందని.. అందుకే తెలంగాణ వ్యాప్తంగా 84 శాతం మంది కేసీఆర్ పాలనపై అసంతృప్తిగా ఉన్నట్టు సర్వే ద్వారా తెలిసింది. గతేడాదితో పోలిస్తే.. కేసీఆర్ పై వ్యతిరేకత మూడొంతులు పెరిగింది.
సర్వేలో కేవలం 3 శాతం ఓట్లతో దేశంలోనే చివరిస్థానంలో నిలిచారు కేసీఆర్. మిగులు రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడం కేసీఆర్ గ్రాఫ్ పడిపోడానికి ఓ కారణంగా కనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు. అంతేకాదు కొన్నాళ్లుగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాల్లో తప్పిదాలు, ఎమ్మెల్యేలు, అధికారుల పనితీరు సరిగ్గా లేకపోవడం కూడా ప్రజల్లో వ్యతిరేకతకు కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు.