మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి సీఎం కేసీఆర్ బీ ఫామ్ అందజేశారు. మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి ప్రగతి భవనకు వెళ్లారు కూసుకుంట్ల. ఈ సందర్భంగా బీ ఫామ్ ఇచ్చిన కేసీఆర్.. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ నిధి నుంచి రూ.40 లక్షల చెక్కును అందచేశారు.
తనకు అభ్యర్థిగా అవకాశమిచ్చినందుకు కేసీఆర్ కు కృతజ్జతలు తెలిపారు కూసుకుంట్ల. సీఎంను కలిసిన వారిలో జగదీశ్ రెడ్డితోపాటు ఎమ్మెల్సీలు రవీందర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గువ్వల బాలరాజు, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి సహా పలువురు ఉన్నారు
మరోవైపు సీఎం కేసీఆర్ తో నర్సయ్య గౌడ్, కర్నె ప్రభాకర్ భేటీ అయ్యారు. మునుగోడు టికెట్ ను వీరిద్దరూ ఆశించారు. అయితే, కూసుకుంట్లకే టికెట్ దక్కిన నేపథ్యంలో వీరిద్దరినీ తన దగ్గరకు పిలిపించుకున్నారు కేసీఆర్. ఈ సందర్భంగా మునుగోడులో టీఆర్ఎస్ విజయానికి అందరూ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో నేతలందరికీ అవకాశాలు ఉంటాయని హామీ ఇచ్చారు.
సీఎం వారికి సర్దిచెప్పడంతో… కూసుకుంట్ల గెలుపు కోసం కృషి చేస్తామన్న నర్సయ్య, కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. కేసీఆర్ ఆదేశాలు పాటిస్తానని.. టికెట్ ఆశించడం తప్పుకాదన్నారు నర్సయ్య. తన అవసరం జాతీయ రాజకీయాల్లో ఉందని సీఎం చెప్పారని తెలిపారు. సీఎం ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ బలోపేతం కోసమేనని.. కూసుకుంట్లను భారీ మెజార్టీతో గెలిపిస్తామని కర్నె ప్రభాకర్ అన్నారు.