టీఆర్ఎస్‌లో కేసీఆర్ తర్వాత స్థానం ఎవరిది అనే దానిపై తరచూ రాజకీయవర్గాల్లో బిగ్ డిబేట్ నడుస్తుంటుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చి తన వారసుడు కేటీఆరే అని ఇప్పటికే కేసీఆర్ సంకేతం ఇచ్చినప్పటికీ.. ఆయన కుటుంబంలోని మిగిలిన సభ్యులైన హరీష్ రావు, కవిత, సంతోష్‌ల పరిస్థితి ఏమిటి.. పార్టీలో వారికి దక్కే ప్రాధాన్యత ఎలా ఉంటుంది అనే అంశాల గురించి నెలకొకసారైనా పెద్ద స్థాయిలోనే చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా హరీష్ రావు లెవెల్ ఏమిటో కేటీఆర్ ఆఫీషియల్‌గా తేల్చిపారేశారు.
వాస్తవానికి హరీష్ రావును కేసీఆర్ ఎప్పుడో పక్కన బెట్టారని, ఈటల ఇష్యూ తర్వాత అనివార్యంగా ఆయన్ను దగ్గరకు తీసుకోవాల్సిన అవసరం వచ్చిందన్న అందరూ చెప్పుకునే మాట. అంతేకాదు హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత మళ్లీ హరీష్ రావును హైదరాబాద్ ఆఫీస్‌లో అడుగుపెట్టనివ్వరని, సిద్దిపేట జిల్లాను దాటి రానివ్వరన్న విశ్లేషణలు ఉన్నాయి. తాజాగా జలవిహార్‌లో జరిగిన పార్టీ సమావేశంలో కేటీఆర్ ఇదే విషయాన్ని చెప్పకనే చెప్పారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
హుజురాబాద్ ఉప ఎన్నిక చాలా చిన్నదని.. దాన్ని లోకల్ నేతలు చూసుకుంటారని గబుక్కున అనేశారు కేటీఆర్. దాని గురించి ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని మాట్లాడారు. దీంతో ఒక్కసారిగా టీఆర్ఎస్ నేతలు షాక్ అయ్యారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక బాధ్యతను కేసీఆర్.. హరీష్ రావుకు అప్పగించారని అందరికీ తెలుసు. హరీష్ రావు కూడా తాను ఆ పని మీదే వచ్చానని హుజూరాబాద్‌లో ఓపెన్‌గా చెప్పుకుంటున్నారు కూడా. అంటే కేటీఆర్ మాటలని బట్టి హరీష్ రావు స్థాయి లోకలేనా అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
హరీష్ రావు ఏ రకంగా కూడా హుజూరాబాద్‌కు లోకల్ కాదు. హుజూరాబాద్ ఆయనకు పొరుగున ఉన్న నియోజకవర్గం కాదు.. అలాగే ఆయన ఆ జిల్లాకు మంత్రి కూడా కాదు. మరి ఏ లెక్కన ఆయన లోకల్ లీడర్ అవుతారన్నది హరీష్ రావు అభిమానుల ప్రశ్న. అంటే హరీష్ రావు స్టేట్ లెవెల్ లీడర్ కాదని.. ఆయన స్థాయి లోకలే అని కేటీఆర్ చెప్తున్నారా అని వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు.