ఓసారి హిట్లర్ పార్లమెంట్‌లోకి ఓ కోడిని తీసుకొస్తాడు. అందరి ముందే దాని ఒక్కో ఈకను పీకేస్తుంటాడు. బాధతో అది విలవిలలాడిపోతుంది. ఆ తర్వాత దాన్ని నేల మీద వదిలి.. తన జేబులో ఉన్న కొన్ని ధాన్యం గింజలను కిందవేస్తాడు. అప్పుడు ఆ కోడి ఆయన బూట్ల దగ్గర ఉన్న ఆ గింజలను ప్రేమగా తింటుంది. అప్పుడు హిట్లర్ పార్లమెంట్ సభ్యుల వైపు తిరిగి ఇలా అంటాడు.. ప్రజలు కూడా కోడిలాంటి వారే. పాలకులు గతంలో వేధించిన సంగతులన్నీ మరిచిపోయి.. ఎన్నికలకు ముందు ఇచ్చిన తాయిలాలనే గుర్తుంచుకుంటారు. ఆయనకంటే గొప్పోడు లేడని నెత్తినపెట్టుకుంటారు అని.
తెలంగాణ ప్రభుత్వం పీఆర్సీపై ప్రకటన చేసిన వేళ.. సరిగ్గా ఇదే కథ గుర్తోస్తోంది. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల్లో ఆ కోడిలాంటి సంతోషమే కనిపిస్తోంది. ఎప్పుడో ప్రకటించాల్సిన పీఆర్సీని ఏళ్లకు ఏళ్లు ఆలస్యం చేశారన్న అసంతృప్తి లేదు. ఏడు శాతమే ఇస్తాం అని బెదిరించి, అవమానించినప్పుడూ వారికి కోపం రాలేదు. కానీ మొన్న సరిగ్గా ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ఏపీ కంటే ఎక్కువే ఇస్తాం అనగానే.. ఆ లైన్‌ను అండర్‌లైన్ చేసుకుంటూ ఉద్యోగ సంఘాలు ఎగిరి గంతేశాయి. అన్నింటిని మరిచిపోయి పాలాభిషేకాలు చేశాయి. టపాసుల మోత మోగించాయి. పైగా కేసీఆర్ ఆరోజు చెప్పిన మాట అనధికారమే కాబట్టి.. ట్రైలర్ సైజలోనే సంబరాలు చేశాయి.
ఇప్పుడు అసెంబ్లీ వేదికగానే అధికారికంగానే ప్రకటన చేసారు. అంటే ఫుల్ సినిమా మాములుగా ఉండదన్నట్టే అన్న మాటలు వినిపిస్తున్నాయి. అ లెక్కన ఇవాళ ఎన్ని పాల ప్యాకెట్లు చిరగాలో.. మరెన్ని ఫోటోలు తడవాలో.. ఇంకెన్ని టపాసులు మోగాలో.. కానీయ్యండి.. కానీ హిట్లర్ చెప్పిన కథను కూడా గుర్తుకు తెచ్చుకోండి!