మంత్రి గంగులతో పడక రాజీనామా వరకు వెళ్లిన మాజీ మేయర్ రవీందర్ సింగ్ కు జాక్ పాట్ కొట్టారు. ఆయన్ను రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ గా నియమించారు సీఎం కేసీఆర్. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఈ విషయం బయటకు రాగానే.. పెళ్లికి వెళ్లి గిఫ్ట్‌గా ఛైర్మన్ పదవి ఇచ్చారని అందరూ అనుకుంటున్నారు.
కరీంనగర్ లో రవీందర్ సింగ్ సింగ్ కుమార్తె వివామం జరిగింది. దీనికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. హెలికాప్టర్ లో ఎర్రవల్లి నుంచి కరీంనగర్ చేరుకున్న సీఎం.. ప్రత్యేక వాహనంలో వివాహానికి హాజరయ్యారు. నవ దంపతులను ఆశీర్వదించి వారితో కలిసి ఫొటోలు దిగారు. ఆ తర్వాత మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి వెళ్లారు. అక్కడ కాసేపు సేదతీరి తేనీటి విందు స్వీకరించి సాయంత్రం హైదరాబాద్ వచ్చారు.
అయితే.. కుమార్తె పెళ్లి వేడుకల్లో సంతోషంగా ఉన్న రవీందర్ సింగ్ కు మరింత ఆనందాన్నిచ్చే న్యూస్ చెప్పారు కేసీఆర్. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ గా నియమించారు. ఈ నియామకంపై భిన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. కేసీఆర్ గురి చూసి సింగ్ కు చెక్ పెట్టారని కొందరు అంటున్నారు. ఎందుకంటే.. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు సర్దార్ రవీందర్ సింగ్. ఉద్యమ సమయంలో కేసీఆర్ తో అత్యంత సన్నిహితంగా మెలిగారు. రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో కరీంనగర్ మేయర్ పదవిని చేపట్టి దక్షిణ భారతదేశంలో ఈ పదవిని చేపట్టిన ఏకైక సిక్కు నాయకుడిగా నిలిచారు.
స్థానిక సంస్థల ప్రతినిధిగా 20 ఏండ్ల అనుభవం కలిగిన రవీందర్ సింగ్ కు కరీంనగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని కేసీఆర్ ప్రకటించారు. అయితే మంత్రి గంగుల కమలాకర్, రవీందర్ సింగ్ మద్య విభేదాలు నెలకొనడంతో పార్టీలో చీలిక మొదలైంది. మరోవైపు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తూ సీఎంను కలిసేందుకు ప్రయత్నించినా సాధ్యపడకపోవడంతో రవీందర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆ సమయంలో టీఆర్ఎస్ కు రాజీనామా చేస్తూ కేసీఆర్ కు ఓ లేఖ కూడా రాశారు. ‘‘ఆర్‌ఎస్‌లో చేరినప్పటి నుంచి అధిష్టానం ఏది చెబితే అదే చేశా.. ఎమ్మెల్సీని చేస్తానని మాట ఇచ్చి తప్పారు. ఇలా చాలాసార్లు జరిగింది. కనీసం మిమ్మల్ని కలుద్దామని అనుకున్నా మీరు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు” అంటూ రాజీనామా పత్రంలో కేసీఆర్ ను తీవ్రంగా ప్రశ్నించారు రవీందర్ సింగ్. సీన్ కట్ చేస్తే.. తర్వాత మళ్లీ టీఆర్ఎస్ లోనే కొనసాగారు ఈయన. అంతేకాదు.. కేసీఆర్ కూడా రవీందర్ కు ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ వస్తున్నారు. దానికి కారణం.. ఈయనకు మంచి ఫాలోయింగ్ ఉండడమే. ఈ క్రమంలోనే.. రవీందర్ అసంతృప్తిని చల్లార్చేందుకు ఎట్టకేలకు పదవి కట్టబెట్టారు కేసీఆర్. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ గా నియమించారు.