సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. దీనికి సంబంధించి విధి విధానాలు ఎలా వుండాలనే దానిపై అధికారులతో చర్చించారు కేసీఆర్. ఈ మేరకు విధి విధానాలను రూపొందించాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను ఆదేశించారు.
ఈ మొత్తం ప్రక్రియ కోసం జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఆ రెండు కమిటీల నివేదిక ఆధారంగా ప్రక్రియను పూర్తి చేస్తారు. మొదట జేపీఎస్ ల పనితీరును మదింపు చేసేందుకు జిల్లా స్థాయిలో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇది పని చేస్తుంది. ఇందులో జిల్లా కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్(లోకల్ బాడీస్), జిల్లా అటవీ అధికారి, జిల్లా ఎస్పీ లేదా డీసీపీ సభ్యులుగా వుండనున్నారు.
ఈ కమిటీ పనితీరును రాష్ట్రస్థాయి నుంచి ఒక సెక్రటరీ స్థాయి లేదా హెచ్ఓడిడీ స్థాయి అధికారి పరిశీలించనున్నారు. మరోవైపు రాష్ట్రస్థాయిలో మరో కమిటీని ఏర్పాటు చేయనున్నారు. పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఇది పని చేస్తుంది. జిల్లా స్థాయి కమిటీ నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలిస్తుంది.
ఆ ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దానిపై చీఫ్ సెక్రటరీకి ఓ నివేదికను పంపుతుంది. ఇక కొన్ని గ్రామ పంచాయతీల్లో తాత్కాలిక ప్రతిపాదికన జేపీఎస్ లను జిల్లా కలెక్టర్లు నియమించారు. ఆయా స్థానాల్లో కూడా నూతనంగా జేపీఎస్ ల భర్తీ ప్రక్రియను, క్రమబద్ధీకరణ తర్వాతి దశలో ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.