సచివాలయంలో సీఎం కేసీఆర్ ఈ రోజు అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో రోజు వారీ షెడ్యూల్ ఖరారు, పోడు భూములు, పలు సంక్షేమ పథకాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
వచ్చే నెల 24 నుంచి 30 వరకు గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ చేయాలని నిర్ణయించారు. నూతనంగా పోడు పట్టాలు పొందిన గిరిజనుల వివరాలు సేకరించి వారికి రైతు బంధు వర్తింపజేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రభుత్వమే స్వయంగా బ్యాంకు అకౌంట్స్ తెరిచి పోడు భూముల పట్టాల పొందిన వారికి ఖాతాల్లో రైతు బంధును జమచేస్తుందన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ను సీఎం ఆదేశించారు.
ఇక రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, కార్యాచరణపై చర్చించేందుకు ఈ నెల 25న జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఈ సమావేశంలో మంత్రులు, జిల్లా ఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొంటారు.
ఇప్పటికే రాష్ట్రంలో పలు గ్రామాల్లో ఇంకా మిగిలి వున్న నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. వాటిని ఇండ్ల నిర్మాణాల కోసం అర్హులైన నిరుపేదలకు కేటాయించాలన్నారు. దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో వారికి ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ చేపట్టాలని నిర్ణయించారు.
జూలైలో గృహ లక్ష్మీ పథకం ప్రారంభించాలన్నారు. గృహలక్ష్మి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరితగతిన తయారు చేయాలని సూచించారు. దళిత బంధు కొనసాగింపు కోసం ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను సీఎం ఆదేశించారు. వచ్చే నెల 14 వైద్య ఆరోగ్య దినోత్సవం సందర్బంగా నిమ్స్ ఆస్పత్రి విస్తరణ పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. 2000 పడకలతో నూతనంగా నిర్మించనున్న సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ భవన నిర్మాణానికి కేసిఆర్ శంఖు స్థాపన చేయనున్నారు.