సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికల్లోనే కాదు.. ఆర్టీసీ సమ్మె విషయంలోనూ ముఖ్యమంత్రి కేసీఆరే గెలిచారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కార్మికులకు న్యాయం జరగాలని ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఆకాంక్షించాయి. పూర్తిస్థాయిలో మద్దతిచ్చి నైతిక స్థైర్యాన్ని ఇచ్చారు. సడక్ బంద్ కు సైతం సై అన్నారు. కానీ అంతలోనే ఆర్టీసీ జేఏసీ సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ గెలిచారు. 30మంది కార్మికుల గుండె ఆగిపోయినా చలించని తెలంగాణ జాతిపిత మళ్లీ మళ్లీ గెలిచారు. తాను తల్చుకుంటే ఏదైనా సాధిస్తారని నిరూపించుకున్నారు.
న్యాయమైన డిమాండ్ల కోసం ఆర్టీసీ కార్మికులు సకల జనుల సమ్మెను మించి ఆందోళన చేశారు. కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధనలో కీలక భూమిక పోషించారు. కానీ కేసీఆర్ ముందు మాత్రం గెలవలేకపోయారు. మంత్రులు, టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కాస్తైనా మద్దతిస్తారని, కనీసం అనుకూల ప్రకటనలైనా చేస్తారని ఆశించారు. కానీ ఉద్యమంలో వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లతోనే స్టేట్ మెంట్లు ఇచ్చి కేసీఆర్ తన నిరంకుశత్వాన్ని చాటుకున్నారు. ఉద్యమం చేసిన కాలంలో ఆర్టీసీ కార్మికులను వాడుకున్న కేసీఆర్.. ఇప్పుడు రాజ్యాధికార అహంకారంతో వాళ్లను హీనంగా అణిచివేసి గెలిచారు. దురదృష్టం ఏంటంటే.. నాడు కార్మికులతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన హరీష్ రావు, కేటీఆర్, ఈటెలలు కూడా మూతికి తాళాలు వేసుకోవడం.
ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమించడం వెనుక ఎన్ని ఒత్తిళ్లు ఉండొచ్చు. తోటి కార్మికుల మరణాలు, జీతాల్లేక వేల కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి. దీంతో జేఏసీ వెనక్కి తగ్గి ఉండొచ్చు. అయితే రేపు కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకుంటారా లేదా అన్న అనుమానాలు ఉన్నాయి. టెక్నికల్ గా ఇప్పటికీ కార్మికులంతా ఆర్టీసీ ఉద్యోగులే. వాళ్ల ఉద్యోగాలు వాళ్లు నిరభ్యరంతంగా చేసుకోవచ్చు. కాదూ కూడదంటే కార్మికులంతా ఏపీఎస్ ఆర్టీసీ సంస్థ ఉద్యోగులే. ఆర్టీసీ కార్మికులు సమ్మె విషయంలో వెనక్కి తగ్గి ఉండొచ్చు. కానీ మూర్ఖపు కేసీఆర్ వ్యక్తిత్వాన్ని బాగా అర్థం చేసుకున్నారు.
ఇక అన్నింటికంటే గొప్ప విషయం ఏంటంటే… గత కొంతకాలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ఇవ్వకుండా నోటికి గుడ్డలు కట్టుకున్న మీడియా.. ఆర్టీసీ సమ్మె విషయంలో మాత్రం రొమ్ము విరుచుకుని వార్తల్ని ప్రసారం చేసింది.