అయోధ్య రాముడికి కేసీఆర్ విరాళం ఎంత..? ఇప్పుడిదే ప్రశ్న ఇటు సోషల్ మీడియా, అటు టీఆర్ఎస్ పార్టీలో చర్చకు కారణం అవుతుంది. చిన్న చిన్న అంశాలకే కేసీఆర్ ప్రభుత్వం తరుపున విరాళం ప్రకటిస్తారు. పైగా అవి భారీగా ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వ నిధులతో ఏపీ దేవుళ్లకు మొక్కులా అని విమర్శలు వచ్చినా… ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా కొన్ని సందర్భాల్లో… నాకంటే హిందువులా మీరంతా, నేను ఎన్నియాగాలు చేశానో తెలుసా… అంటూ బీజేపీ నేతలపై మండిపడ్డారు.
కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. రాష్ట్రంలో బీజేపీ దూకుడు మీదుంది. మరోవైపు అయోధ్యలో రామజన్మభూమిలో రాముడి మందిర నిర్మాణ పనులు మొదలవుతున్నాయి. ఎంతో మంది విరాళం అందిస్తుండగా… సీఎం కేసీఆర్ భారీ విరాళం అందిస్తారని, త్వరలో ప్రకటన కూడా చేస్తారని చర్చలు సాగుతున్నాయి. సమయం తీసుకోని కేసీఆర్ భారీ విరాళం అందించి, హిందువుల చూపు తనవైపు తిప్పుకుంటారని టీఆర్ఎస్ శ్రేణులు ధీమాగా ఉండగా, కేసీఆర్ నోరుకు మొక్కాలే… అసలే ఆర్థిక కష్టాల్లో సారు ఎంతంటాడో అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
ఒక్క విరాళం వరకే కాదు అయోధ్యలో తెలంగాణ యాత్ర భవన్ కు స్థలం కోరుతారని, భద్రాద్రి రాముడి పేరుతో అక్కడ భవనం నిర్మించేందుకు కూడా ఇప్పుడే నిధులు ప్రకటిస్తారంటూ చర్చలు సాగుతున్నాయి.