సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి 8 రోజులయ్యింది. ఇంకా హైదరాబాద్ రిటర్న్ కాలేదు. పోనీ… అధికారిక పనులేమయినా పెండింగ్ లో ఉన్నాయా అంటే అవేవీ అధికారికంగా లేవు. దీంతో కేసీఆర్ ఢిల్లీ టూర్ పై పార్టీ వర్గాలతో పాటు బయట కూడా కొత్త చర్చ తెరపైకి వస్తోంది.
పార్టీ ఆఫీసు నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు ఢిల్లీ వెళ్లిన కేసీఆర్… సెప్టెంబర్ 2న ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రధాని మోడీతో సెప్టెంబర్ 3న భేటీ కాగా, సెప్టెంబర్ 4వ తేదీన కేంద్రమంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. సెప్టెంబర్ 5న ఎలాంటి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనని ఆయన, సెప్టెంబర్ 6న కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, గజేంద్రసింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఎలాంటి కార్యక్రమాలు లేవు. పైగా కేసీఆర్ చాలా అరుదుగా ఫ్యామిలీతో ఢిల్లీ వెళ్తారు. ఈ సారి కూడా కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ ఉన్నారు.
అయితే, మీడియాలో కేసీఆర్ కు కంటి, దంత పరీక్షలు చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. అంతేకాదు టీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్న దాని ప్రకారం కేసీఆర్ బుధవారం కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. కానీ తెలంగాణ సీఎంవో నుండి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం లేదు. కేసీఆర్ సీఎం అయ్యాక ఇన్ని రోజులు ఢిల్లీలో ఉండటం చాలా అరుదు. పైగా వైద్య పరీక్షల హాడావిడి నడుస్తుండటంతో… కేసీఆర్ ఆరోగ్యంపై టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై సీఎంవో అధికారులు ఎమైనా ప్రకటన చేస్తారో చూడాలి.