నాగార్జునసాగర్ బైపోల్ అధికార టీఆర్ఎస్‌కు పెద్ద పజిల్‌గా మారింది. ఉప ఎన్నిక అనివార్యమని తెలిసి నెలలు గడిచిపోతున్నా.. అభ్యర్థి ఎవరనేదానిపై ఇప్పటికీ తేల్చుకోలేకపోతోంది. తొలుత నోముల కుమారుడు భగత్‌కు టికెట్ ఇస్తారని బలంగా ప్రచారం జరిగినా.. మళ్లీ ఎవరూ ఆ విషయం గురించి మాట్లాడటంలేదు. ఆ తర్వాత ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, నియోజకవర్గ నేత కోటిరెడ్డి పేర్లు వినిపించినా.. వాళ్లకు అవకాశం ఇవ్వడం కూడా అనుమానమేన్న చర్చ ఆ పార్టీలో జరుగుతోంది.
దుబ్బాక అనుభవం దృష్ట్యా.. నాగార్జున సాగర్ అభ్యర్థి విషయంలో తొందరపాటు నిర్ణయాలు కాకుండా.. ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తున్నారు కేసీఆర్. అందుకే ఇంకా ఎవరిని ఫైనల్ చేయడం లేదని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో కొత్తగా వేరే అభ్యర్థుల పేర్లు వినిపిస్తున్నాయి.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పార్టీ బలంగానే ఉన్నా.. సామాజిక సమీకరణాలు అత్యంత ముఖ్యంగా మారాయి. ఇక్కడ అత్యధిక ఓటర్లు యాదవ సామాజికవర్గానికి చెందినవారే కావడంతో.. ఆ వర్గంలోనే ఒకరిటికి టికెట్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. దివంగత ఎమ్మెల్యే నోముల కూడా ఇదే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో.. కచ్చితంగా యాదవులకే టికెట్ ఇచ్చేట్టుగా కనిపిస్తున్నారు. అలా చూస్తే ఆయన కుమారుడు భగత్‌కే టికెట్ ఇచ్చే చాన్స్ ఉన్నప్పటికీ.. అతనికి వేరే అవకాశం ఇచ్చి.. సాగర్‌లో మరో నేతకు చాన్స్ ఇవ్వాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.
టీఆర్ఎస్‌కు చెందిన యాదవ సామాజిక వర్గ నేతలు మన్నె రంజిత్ యాదవ్, పెద్దబోయిన శ్రీనివాస్, కట్టెబోయిన గురువయ్య పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నారని తాజా సమాచారం. ఇటీవలే ఈ ముగ్గురితో కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడినట్టుగా తెలిసింది. వారి బలాబలాను ఆరా తీస్తున్న కేసీఆర్.. స్థానిక నేతల అభిప్రాయం కూడా తీసుకుని ఈ ముగ్గురిలో ఎవరో ఒకరిని అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా అభ్యర్థి ఎంపిక విషయంలో ఇంత ఆలస్యం చేయడం.. ఇంతలా ఆలోచించడం కేసీఆర్‌కు ఇటీవల ఇదే మొదటిసారి అంటున్నారు విశ్లేషకులు.