గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఓవైపు నాయకుల పనితీరును చూసి ఓటేయ్యండి అని కోరుతూనే… ఎన్నికల వరాలను ప్రకటించారు. త్వరలో హైదరాబాద్ లో 24గంటల మంచినీటి సరఫరా చేస్తామని, ప్రతి కుటుంబానికి నెలకు 25వేల లీటర్లు ఇస్తామన్నారు. దోబీ ఘాట్, లాండ్రీలకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు.
హైదరాబాద్ నిధుల కోసం కేంద్రాన్ని కోరితే ఇవ్వలేదని… వరదల నుండి నగరాన్ని కాపాడుకోవాలని, అందుకు ప్రతి బడ్జెట్ లో 10వేల కోట్లు కేటాయిస్తామన్నారు. టీఆర్ఎస్ ను గెలిపిస్తే వరదల నుండి కాపాడతామన్నారు కేసీఆర్. నగర కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయటం, ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో పొడిగిస్తామన్నారు. మూసీని గోదావరితో అనుసంధానిస్తామని… ప్రక్షాళన చేస్తానన్నారు.
కొందరి కోసం పనిచేసే ఎజెండా నాకు లేదని… అందరి కోసం పనిచేస్తామని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి అన్నారు. ఎవడో తలకు మాసినోడు ఏదో వాగితే జరగదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో వరదలొస్తే నా ఈ కొడుకులు రూపాయి ఇవ్వకున్నా మేమిచ్చామన్నారు. 650కోట్లు పంచామన్నారు. ఎన్నికలయ్యాక ఇంకా ఎంతమంది ఉన్నా డిసెంబర్ 7 నుండి పైసలిస్తామన్నారు. కేంద్రాన్ని 1350కోట్లు అడిగితే బెంగుళూరు, అహ్మాదాబాద్ కు ఇచ్చి మనకు ఇవ్వలేదని.. ప్రజలు దీన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు.
వరద వస్తే ఆదుకోని నేతలు… వరదలెక్కనే నేతలు వస్తున్నారని, మున్సిపల్ ఎన్నికలా…. నేషనల్ ఎన్నికలా అంటూ బీజేపీపై ఎదురుదాడి చేశారు. కేసీఆర్ వస్తుండని తెలిసి ఢిల్లీలో వణికిపోతున్నారని, అందుకే వారే హైదరాబాద్ వచ్చి నన్ను కట్టడి చేయాలనుకుంటున్నారన్నారు. యూపీ సీఎం, మహారాష్ట్ర మాజీ సీఎంలు వస్తున్నారని… కానీ వాళ్లదే సక్కగా లేకున్నా మన దగ్గర ఊరేగుతున్నారన్నారు. ఈ వంచకులు, మోసగాళ్లకు మోసపోవద్దని… మళ్లీ చేసేది మేమేనన్నారు.
మేధావుల్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని… నగరాన్ని కాపాడుకునేందుకు ఇదే సమయం అని, శాంతిభద్రతలను కాపాడుకునేందుకు కృషిచేయాలని, మన పిల్లల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని టీఆర్ఎస్ కు సపోర్ట్ చేయాలన్నారు.