హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, డీజీపీ, సీపీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. దీనితో పాటు సీఎం ఛాంబర్, సీపీ చాంబర్లను కూడా కేసీఆర్ ప్రారంభించారు. తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం.. కమాండ్ కంట్రోల్ నమూనాను పరిశీలించారు.
అత్యాధునిక సాంకేతికతతో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నిర్మించారు. దీన్ని ఐదు టవర్లుగా విభజించారు. టవర్ -ఏ లో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఉంటుంది. టవర్ -బీలో రాష్ట్రానికి సంబంధించిన అన్ని టెక్నాలజీస్ ఉంటాయి. టవర్ -సీ లో ఆడిటోరియం, టవర్- డీలో మీడియా, టవర్-ఈ అనేది కమాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంటర్ ఉంటుంది. ఇది పర్యావరణహిత, ఐకానిక్ భవనం.
ఏడు ఎకరాల విస్తీర్ణంలో రూ.600 కోట్ల వ్యయంతో కమాండ్ కంట్రోల్ కేంద్రంలో 5 టవర్లు ఏర్పాటు చేశారు. ఒకేసారి లక్ష సీసీటీవీ కెమెరాలు వీక్షించేలా బాహుబలి తెరలు ఇందులో ఉన్నాయి. దీని ఏర్పాటుతో నగర కమిషనరేట్ పరిధిలోని శాంతిభద్రతలు, సీసీఎస్, టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ .. ఇలా అన్ని విభాగాలన్నీ ఒకే గొడుగు కిందకు చేరాయి. వీటిలో ఏ విభాగానికి సంబంధించిన పని కోసమైనా ప్రజలు వివిధ ప్రాంతాలకు తిరగాల్సిన అవసరం లేకుండా సింగిల్ విండో విధానం అమలు కానుంది.
కమాండ్ , కంట్రోల్ సెంటర్ లో విపత్కర, అత్యవసర పరిస్థితుల్లో అన్ని డిపార్ట్ మెంట్స్ చీఫ్ లు ఒకే దగ్గర సమావేశమై నిర్ణయాలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో కార్పొరేట్ స్థాయి సేవలు అందుబాటులోకి వస్తాయి. దీని కోసం ఏడో అంతస్తులో సీఎం, ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా కీలక విభాగాల చీఫ్ లకు ఛాంబర్లు ఉన్నాయి.