మోడీ సర్కార్ పై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రపతి ఎన్నికల్లో యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టీఆర్‌ఎస్ సమావేశం నిర్వహించింది. ఇందులో పాల్గొన్న కేసీఆర్.. తమ ప్రశ్నలకు మోడీ సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ పాలనలో ఏ ఒక్క హామీ నెరవేరలేదన్నారు. రైతులు ఉగ్రవాదులుగా, వేర్పాటువాదులుగా కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు. మోడీ సభలో తమ గురించి బాగా మాట్లాడబోతున్నారని.. విపక్ష నేతలపై తప్పుడు ఆరోపణలు చేయబోతున్నారని చెప్పారు కేసీఆర్.
మోడీ ఎన్నికలప్పుడు తియ్యటి మాటలు చెబుతారని.. తనను తాను మేధావిగా భావిస్తారని అన్నారు. ఎరువులు, నిత్యావసరాల అన్ని ధరలు పెంచారన్న సీఎం.. రైతు చట్టాలు సరైనవే అయితే వాటిని ఎందుకు వెనక్కి తీసుకున్నారని ప్రశ్నించారు. ద్రవ్యోల్బణం పెరుగుతోందని.. దేశం ముందు తలదించుకున్నారని విమర్శించారు. బీజేపీ పాలనలో రైతులు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు ఎవరూ సంతోషంగా లేరని చెప్పారు.
హైదరాబాద్ సమావేశంలో మోడీ ప్రసంగమే కాదు.. తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కేసీఆర్. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, వారి ఖర్చులు రెట్టింపు చేశారన్నారు. ప్రధానిగా తానే శాశ్వతం అనే భ్రమలో మోడీ ఉన్నారని.. ఆయన ప్రధానిలా కాకుండా సేల్స్ మెన్ లా వ్యవహరిస్తున్నారని చురకలంటించారు. ప్రభుత్వ వ్యవస్థను దుర్వినియోగం చేశారని.. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.
శ్రీలంకలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కళ్లారా చూస్తున్నామన్న కేసీఆర్.. తాము మౌనంగా ఉండమని పోరాటం చేస్తామని చెప్పారు. బీజేపీ కారణంగా దేశ ప్రజలు తల దించుకోవాల్సి వస్తోందన్నారు. మీ రక్తంలో కొంతైనా నిజాయితీ ఉందా? అని మోడీని ప్రశ్నించారు. బీజేపీ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని.. మేకిన్ ఇండియా అంటే ఇదేనా? అని నిలదీశారు. పెద్ద కంపెనీలన్నీ దేశం నుంచి వెళ్లిపోయాయన్న ఆయన.. మోడీని చూసి పెద్ద పరిశ్రమలు పారిపోతున్నాయని విమర్శించారు. ఇలాగే చోద్యం చూస్తూ కూర్చుంటే దేశం సర్వనాశనం అవుతుందన్నారు. వ్యక్తిగతంగా మోడీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని.. బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నా కూడా ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారని ప్రశ్నించారు.