అమరావతిగా రాజధాని మార్పు తథ్యం అని వైసీపీ అధికారంలోకి రాగానే ఫిక్స్ అయిపోయింది. అయితే… మార్చితే ఎక్కడకు మార్చుతారు, దొనకొండకే రాజధాని మార్చబోతున్నారా…? హైకోర్టు విషయంలో రాయలసీమను పరిగణలోకి తీసుకుంటారా…? ఇలా రకరకాల ఊహాగానాలు ఉండేవి. అయితే… ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు రాజకీయ ప్రయోజనాలు కూడా తోడై ఉంటాయన్నది అందరికీ తెలిసిందే. అయితే… జగన్ రాజధానులు మూడు ఉంటాయని చేసిన ప్రకటనలో తెలంగాణ సీఎం కేసీఆర్ సలహా పాటించినట్లు కనపడుతుంది.
సీఎం కేసీఆర్… ఉద్యమ నాయకుడిగా చంద్రబాబును, టీడీపీని ఎంత ఇరుకున పెట్టారో అందరికీ తెలుసు. సమైక్యాంధ్ర అంటే తెలంగాణలో పార్టీ నష్టం, జై తెలంగాణ అంటే ఆంధ్రాలో పార్టీకి నష్టం అనే విధంగా ఎత్తుగడలు వేశారు. ఆ ఎత్తుగడలతోనే చంద్రబాబు టీడీపీ ప్రతిభను తెలంగాణలో కోల్పోవలసి వచ్చింది. టీడీపీ అంటే తెలంగాణ వ్యతిరేకి అనే ముద్ర వేసేలా ప్రజల్లో సెంటిమెంట్‌ను రగిల్చారు సీఎం కేసీఆర్.
ఇప్పుడదే ఫార్మూలాను తన మిత్రుడైన సీఎం జగన్‌తో కూడా అప్లై చేయించారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేస్తూ… అమరావతిలో రాజధాని ఉంటూనే, కర్నూల్‌తో పాటు విశాఖను కూడా రాజధానిగా చేయబోతున్నాం అంటూ ప్రకటన చేశారు. దీంతో అమరావతిని తన మానసపుత్రికగా చెప్పుకుంటున్న చంద్రబాబుకు ఇప్పుడ రాజకీయంగా ఇబ్బందికర పరిణామం ఎదురవుతోంది. విశాఖకు రాజధాని వద్దు అని అనలేడు. ఒకవేళ అలా అంటే.. ఉత్తరాంధ్రలో టీడీపీపై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. చంద్రబాబే అడ్డుకుంటున్నారని జగన్ ప్రచారం చేస్తారు. కర్నూల్‌కు హైకోర్టు వద్దు అని కూడా చంద్రబాబు అనలేరు… అమరావతిలోనే కొనసాగాలి అని ప్రకటన వస్తే రాయలసీమలో టీడీపీకి ఇబ్బంది. దీంతో ప్రస్తుతం టీడీపీ, చంద్రబాబు పరిస్థితి ఒకప్పటి తెలంగాణ ఉద్యమ ఇరకాట పరిస్థితిని తలపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో లాగా ఎదో ఒక స్టాండ్ తీసుకుంటే… మరో చోట పార్టీకి ఇబ్బందులు తప్పవు. అలాగని వెల్‌కమ్ చేసినా… ప్రస్తుత అమరావతిలో ఇబ్బంది తప్పదు. దీంతో ముందు నుయ్యి-వెనుక గొయ్యిలా తయారైంది చంద్రబాబు పరిస్థితి అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎం కేసీఆర్ సలహాతో వైఎస్ జగన్ వేసిన తాజా వ్యూహాన్ని ఇప్పుడు చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారో చూడాలి అంటున్నారు విశ్లేషకులు.