నిత్యం చంద్రబాబుని తిట్టే కేసీఆర్ పాలనలో మాత్రం బాబునే అనుసరిస్తున్నాడు అంటున్నారు రాజకీయ విశ్లషకులు. చాలా విషయాలలో చంద్రబాబు మార్క్ పాలన కనపడుతుంది అంటున్నారు. కేసీఅర్ అధికారంలోకి రాగానే ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ధర్నా చౌక్ ఎత్తేశాడు. అంతకు ముందు చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో సెక్రటేరియట్ దగ్గర ఉండే ధర్నా చౌక్ ను ఇందిరా పార్క్ కు మార్చారు. ఇప్పుడు కేసీఅర్ ఏకంగా సిటీ బయటకు పంపారు. అలాగే ఉద్యమాల విషయంలో బాబు ఏవిధంగా అణిచివేత ధోరణిని వ్యవహరించాడో కేసీఆర్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు అని చెప్పుకొస్తున్నారు విశ్లేషకులు. ముందస్తు అరెస్టులు చేయడం, లాఠీఛార్జ్ లు చేయడం, బాష్పాయువు గోళాలు విసరడం ఇందులో భాగమే.
నాడు చంద్రబాబు అంగన్‌వాడి మహిళలను గుర్రాలతో తొక్కిస్తే నేడు కేసీఅర్ ఆర్టీసీ కార్మికులకును పోలీస్ లాఠీలతో కొట్టించాడు. బాష్పాయువు గోళాలతో ట్యాంక్ బండ్ నుంచి తరిమికొట్టారు. నక్సలైట్ లను ఎన్ కౌంటర్ చేసే విషయంలో కూడా బాబు బాటలోనే కేసీఅర్ ప్రయాణం సాగుతుంది. అధికారంలోకి వచ్చి రాగానే తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న కొందరు యువకులు యువతులు మావోయిస్ట్ లతో సంబంధాలు పెట్టుకున్నారని పోలీసులకు సమాచారం ఉందని వారిని పట్టుకునే ప్రయత్నం లో వారు కాల్పులకు పాల్పడగా పోలీసులు ఎదురు కాల్పులు చేయగా వారు చనిపోయారని బాబు నాటి కథలనే పోలీసులు చెప్పారని గుర్తు చేస్తున్నారు. అంతే కాదు నాడు బాబు మావోయిస్ట్ అనుబంధ సంఘాల పై నిషేధం విధిస్తే నేడు కేసీఆర్ కూడా అదే పనిచేస్తున్నాడు.
అంతే కాదు నేడు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన ప్రజాసంఘాలను కూడా మావోయిస్ట్ అనుబంధ సంఘాలు గా కేసీఅర్ ప్రభుత్వం నిషేధిచింది. నాడు బాబు హక్కుల సంఘం నాయకులను పోలీసులతో కిడ్నాప్ చేయించి బెదిరించి తన పదవులకు రాజీనామా చేయిస్తే నేడు కేసీఆర్ ప్రభుత్వం హక్కుల సంఘాలతో మావోయిస్ట్ అనుబంధ సంఘం అని ప్రకటించింది.. నాడు బాబు పాలనలో నక్సలైట్ అమరవీరుల స్థూపాలను పోలీసులు ధ్వంసం చేసినట్లే నేడు కేసీఆర్ పాలన లోకూడా అదే జరుగుతుంది. శనివారం తెల్లవారుజామున ఇల్లందు లో ఇటీవల పోలీసుల కాల్పులలో ప్రాణాలు కోల్పోయిన లింగన్న స్థూపాన్ని పోలీసులు ధ్వంసం చేశారు.
అలాగే నాడు చంద్రబాబు కార్మికులకు సంఘాలు ఉండాల్సిన అవసరంలేదు అని చెప్పాడు. నేడు కేసీఅర్ కూడా అదే చెప్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా కార్మికులకు సంఘాలు ఉండడానికి వీలులేదు అంటున్నారు. ప్రైవేటీకరణ విషయంలో కూడా బాబు బాటలోనే కేసీఆర్ నడుస్తున్నారు. ఇందుకు ఆర్టీసీ ప్రైవేటీకరణ ఇందుకు ఉదాహణగా చెప్పొచ్చు అంటున్నారు విశ్లేషకులు.
అధికారులతో గంటలు గంటలు రివ్యూ చేసే విషయంలో అధికారులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే విషయంలో వారిమీద ఆధారపడే విషయంలో ఇలా అనేక విషయాలలో బాబు పాలనను మరిపిస్తున్నారు. బాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాబూ టీమ్ లో ఒకరుగా కేసీఆర్ ఉన్నారు. నాడు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో నిత్యం క్యాడర్ కు శిక్షణ ఇచ్చే విషయంలో కేసీఆర్ కీలక బాధ్యతలు చూసేవాడు. పాలనలో తెచ్చే సంస్కరణల విషయంలో, పథకాలను రూపకల్పన చేసే విషయంలో కూడా కేసీఆర్ కీలకంగా వ్యవహరించేవారు. అందుకే కేసీఅర్ పాలనలో బాబు మార్క్ పాలన కనపడుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.