కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ తెలంగాణను నిరుత్సాహపర్చిందని పేర్కొన్నారు. ఇది పేదల వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అని అభిప్రాయపడ్డారు.
ఆర్థిక మంత్రి ప్రసంగంలో తెలంగాణకు ప్రత్యేక ప్రకటనలేవీ లేవన్నారు. పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల గురించి కూడా ప్రస్తావన లేదని మండిపడ్డారు. పునర్విభజన చట్టాన్ని ఆమోదించి పదేళ్లు అవుతున్నా..ఇప్పటి దాకా బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులో మిల్లెట్ రిచెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నట్లు.. గతంలోనూ అనేక ఉత్తుత్తి హామీలు ఇచ్చారని విమర్శించారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరగడానికి సీఎం కేసీఆర్ బాధ్యత కూడా ఉందన్నారు. తెలంగాణకు అవసరమైన నిధులు రాబట్టేలా.. బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో కేసీఆర్ విఫలమయ్యారన్నారు. ఇదే సమయంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. ఇది పెత్తందారులకి అనుకూల బడ్జెట్ అని ఫైర్ అయ్యారు. కార్పొరేట్ శక్తులకు లాభం చేసే పనిలో నిర్మలా సీతారామన్ ఉన్నారన్నారు.
ఈ బడ్జెట్ పేదలకు ఉపకరించేది లేదని, బడ్జెట్ కూడా బీజేపీ రాజకీయమే చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలున్న రాష్ట్రాలకు వెసులుబాటు ఇచ్చి ఇతర రాష్ట్రాలకు అన్యాయం చేశారన్నారు. మోడీ హామీల అమలుకు కేటాయింపులు లేవని, ఉద్యోగాల కల్పనపై దృష్టి లేదని దుయ్యబట్టారు.