నియోజకవర్గం ఏదైనా ఓటర్లపై ప్రభావితం చూపే లీడర్లంతా మన పార్టీలోనే ఉండాన్నట్లుగా కేసీఆర్ లీడర్లను టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ఇతర పార్టీల్లో పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవటంతో పార్టీపై, కేసీఆర్ పై అసంతృప్తి ఉన్నప్పటికీ చాలా మంది నేతలు పార్టీలోనే కొనసాగుతున్నారు.
కానీ కొన్ని రోజులుగా తెలంగాణలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాగానే కాంగ్రెస్ లో దూకుడు పెరిగింది. వరుసగా మీటింగ్ లు, సమీక్షలతో పార్టీ నేతల్లో హాడావిడి పెరిగింది. పార్టీ నుండి వెళ్లిపోయిన వారు వెళ్లిపోగా సైలెంట్ అయిన నేతలంతా మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. కొందరు పార్టీలోకి తిరిగి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇటు బండి సంజయ్ పాదయాత్రతో బీజేపీలోనూ హాడావిడి పెరిగింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో బండి సంజయ్ పాదయాత్ర సూపర్ సక్సెస్ అన్న టాక్ వచ్చింది. కానీ కేసీఆర్ కు బీజేపీ పెద్దలతో దోస్తీ కుదిరింది అన్న వార్తలు పార్టీ శ్రేణులను కాస్త అయోమయంలో పడేశాయి. మరోవైపు రిటైర్డ్ ఐపీఎస్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, షర్మిలలు వరుసగా జనాల్లోకి వెళ్తున్న నేపథ్యంలో… టీఆర్ఎస్ అలర్ట్ అవుతోంది.
దీంతో, చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. మొదటి దఫా ప్రభుత్వం ఏర్పాటు చేశాక వివిధ కార్పోరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లను నియమించారు. వారి ఆ పదవి కాలం ముగిసిపోయింది. దీంతో రెన్యూవల్ కోసం వారంతా వెయిట్ చేస్తున్నారు. దీంతో ఇతర పార్టీ నేతలు వల వేయకముందే నేతలకు పదవులు అప్పజెప్పాలన్న ఆలోచనతో టీఆర్ఎస్ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా లిస్ట్ రెడీ చేసి… కసరత్తులు చేస్తున్నారు. పార్టీ కమిటీలు ఫైనల్ చేసే పనిలో ఉన్న కేటీఆర్… ఆ తర్వాత నామినేటెడ్ పోస్టుల ప్రకటన చేయబోతున్నట్లు టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి.