సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన వాయిదా పడింది. పర్యటనను బుధవారానికి వాయిదా వేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. కొండగట్టులో మంగళవారం భక్తుల రద్దీని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
కేసీఆర్ పర్యటనకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఆయన పర్యటన ఏర్పాట్లు జరుగుతున్న తీరును చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ భాషా ఇప్పటికే దగ్గరుండి పరిశీలించారు.
బుధవారం ఉదయం హెలికాప్టర్‌లో సీఎం కేసీఆర్ జేఎన్టీయూ క్యాంపస్ చేరుకుంటారు. అక్కడి నుంచి ఆలయానికి స్వామి వారి దర్శనం చేసుకుంటారు.
అనంతరం అధికారులతో కలిసి ఆలయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఆలయం వద్ద గల కోనేరు పుష్కరిణి, కొండలరాయుని గుట్ట, సీతమ్మ వారి కన్నీటిధార, భేతాళ స్వామి ఆలయంతో పాటు తదితర ప్రాంతాలను ఆయన పరిశీలిస్తారు.
ఆ తర్వాత అధికారులతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహిస్తారు అక్కడే ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహిస్తారు.