మునుగోడు షెడ్యూల్ రావడంతో సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో నిర్వహించాలనుకున్న జనరల్ బాడీ మీటింగ్ ఉంటుందా? లేదా? అనే సందహం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం స్పందిస్తూ.. అక్టోబర్ 5న తెలంగాణ భవన్ లో మీటింగ్ యధావిధిగా జరుగుతుందని స్పష్టం చేశారు.
మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రభావం తమ సమావేశంపై ఉండదని తెలిపారు కేసీఆర్. సభ్యులెవరూ గందరగోళానికి గురికావద్దని అన్నారు. ముందుగా ప్రకటించనట్లే అక్టోబర్ 5 దసరా నాడు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో సమావేశం జరుగుతుందని తెలిపారు. సభ్యులంతా అనుకున్న సమయానికి హాజరుకావాలని స్పష్టం చేశారు.
జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన కేసీఆర్.. దసరా నాడు పార్టీ పేరు ప్రకటించనున్నట్లు టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నారు. అందులో భాగంగానే విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి కీలక తార్మానానికి ఆమోదం తెలపాలని ముందుగా నిర్ణయించారు. ఈ మీటింగ్ కు పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలతో పాటు జిల్లాల నేతలు రావాలని ఆదేశాలు వెళ్లాయి.
ఓవైపు ఆ మీటింగ్ కోసం ఏర్పాట్లు జరుగుతుండగా.. తాజాగా మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. దీంతో టీఆర్ఎస్ సమావేశంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ సమావేశం నిర్వాహణపై స్పష్టతనిచ్చారు.