తెలంగాణ రాజకీయాల్లో సంచలనం జరగబోతుందా…? రాజకీయంగా కీలకమైన నిర్ణయానికి బీజేపీ- టీఆర్ఎస్ లు సిద్ధమవుతున్నాయా…? ఒకే నెలలో కేంద్రమంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షాతో సీఎం కేసీఆర్ మూడోసారి భేటీ కావటం ఇవే ప్రశ్నలకు తావిస్తోంది.
సెప్టెంబర్ నెల స్టార్టింగ్ లో సీఎం కేసీఆర్ ఢిల్లీలో పర్యటించారు. ప్రధాని మోడీతో పాటు అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులను కలిసి వచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి, సమస్యలపై అని అంతా అనుకున్నారు. సీఎంవో వర్గాలు కూడా అదే విషయాన్ని చెప్పాయి. తాజాగా సీఎం కేసీఆర్ మళ్లీ ఢిల్లీ వెళ్లారు. మాములుగా అయితే కేసీఆర్ నెలకు ఒకసారి కూడా ఢిల్లీ వెళ్లరు. కానీ మావోల ప్రభావంపై కేంద్ర హోంమంత్రితో సీఎంల భేటీ కావటంతో వెళ్తున్నట్లు అంతా భావించారు. ఆ సమావేశంలో బ్రేక్ టైంలోనూ కేసీఆర్ అమిత్ షా పక్కనే కూర్చొని మాట్లాడుతున్నట్లు కనిపించారు.
తాజాగా అమిత్ షా తో సీఎం కేసీఆర్ మరోసారి భేటీ అయ్యారు. నిజానికి ఇది సడన్ గా జరిగిన భేటీయే. ముందస్తుగా అమిత్ షాతో మీటింగ్ కన్ఫామ్ కాలేదు. దీంతో ఈ వరుస భేటీలు ఎదో జరగబోతున్నాయనడానికి సంకేతంగా విశ్లేషకులు, టీఆర్ఎస్ శ్రేణులు సైతం భావిస్తున్నాయి. ఇదే నెలలో అమిత్ షా తెలంగాణకు కూడా వచ్చారు. అయితే బీజేపీ మీటింగ్ కే ఆయన పరిమితం అయినప్పటికీ కేసీఆర్ పై ఒంటి కాలిపై లేస్తారు, తీవ్ర హెచ్చరికలుంటాయని అంతా భావించారు. కానీ అమిత్ షా కేసీఆర్ పై స్పందించిన తీరుతో బీజేపీ శ్రేణులు సైతం నిరూత్సాహపడ్డాయి.
కానీ ఇప్పుడు వరుసగా మూడో భేటీ అంటే ఏం జరగనుంది…? బీజేపీ-కేసీఆర్ అధికారికంగానే చేతులు కలుపుతారా…? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.