సీఎం కేసీఆర్ ప్రస్తుతం జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే ఉత్తరాది పర్యటనలో బిజీగా ఉన్నారు. తాజాగా కేసీఆర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో మరోసారి భేటీ అయ్యారు. కేజ్రీవాల్ నివాసంలో లంచ్ అనంతరం ఇరువురు నేతల మధ్య ఈ సమావేశం జరిగింది.
ఢిల్లీలోని స్కూల్స్‌ను కేజ్రీవాల్ తో కలిసి కేసీఆర్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యపై కేజ్రీవాల్ సర్కారు అనుసరిస్తున్న విధానాల గురించి తెలుసుకున్నారు. ఇక తాజాగా రాజకీయ విధానాలపై చర్చించేందుకే మరోసారి కేజ్రీవాల్ తో కేసీఆర్ భేటీ అయినట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాలు, రాష్ట్రాలపై కేంద్రం అజమాయిషీ, సమాఖ్య స్ఫూర్తి తదితర విషయాల గురించి చర్చించినట్లు సమాచారం.
ఇక లంచ్ తర్వాత ఇద్దరు సీఎంలు చండీగఢ్ వెళ్లనున్నారు. అక్కడ కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ జరిపిన ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలకు సీఎం కేసీఆర్ చెక్కులు అందజేయనున్నారు. 600 కుటుంబాలకు ఆర్థిక సాయంగా ఒక్కో రైతుకు రూ.3 లక్షల చొప్పున చెక్కులను అందించనున్నారు.
సీఎం కేసీఆర్ బృందంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు సంతోశ్ కుమార్, నామా నాగేశ్వరరావు, రంజిత్ రెడ్డి, వెంకటేష్ నేత ఉన్నారు. ఈ కార్యక్రమంలో ముగ్గురు సీఎంలు కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ పాల్గొననున్నారు.