జాతీయ పర్యటనలో భాగంగా మాజీ ప్రధాని దేవెగౌడను కలిశారు సీఎం కేసీఆర్. ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లిన ఆయన.. పద్మనాభనగర్ లోని దేవెగౌడ ఇంటికి వెళ్లారు. అక్కడ.. మాజీ సీఎం కుమారస్వామి, జేడీఎస్ నేతలు స్వాగతం పలికారు.
దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు, జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంతోపాటు భవిష్యత్ కార్యాచరణపై దేవెగౌడతో చర్చించారు కేసీఆర్. ఈ భేటీలో కుమారస్వామితోపాటు ఆయన తనయుడు, హీరో నిఖిల్ గౌడ కూడా ఉన్నారు.
త్వరలో జరగనున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశంపై కూడా వీరు చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చెలాయిస్తోందని.. కొన్నాళ్లుగా కేంద్ర విధానాలను తప్పుబడుతున్నారు కేసీఆర్. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల నేతలను కలుస్తున్నారు.
జాతీయ రాజకీయాలపై ప్రేమతో ప్రాంతీయ పార్టీలను ఏకం చయాలని చూస్తున్నారు. అయితే.. కాంగ్రెస్ లేని కూటమి నిలబడదని నేతలు కేసీఆర్ కు హ్యాండ్ ఇస్తూ వస్తున్నారు. మీటింగ్ సమయంలో మంచిగా నవ్వుతూ పలకరించుకున్నా తర్వాత అన్నీ మారిపోతున్నాయి. మరి.. దేవెగౌడ కుటుంబం అన్నా కేసీఆర్ వెంట ఉంటుందా? లేదా? అనేది కొన్నాళ్లు ఆగితే తెలుస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.