విభజించు పాలించు నినాదాన్ని అమలుచేయటం పాలకులకు వెన్నతో పెట్టిన విద్యలా కనపడుతోంది. స్వరాష్ట్రం ఒక్కటై… యావత్ తెలంగాణ ఉద్యోగులు అప్పట్లో సకలజనుల సమ్మెలాంటి గొప్ప ఉద్యమాలు చేశారు. నాటి సెగ ఎలా ఉంటుంది, ఉద్యోగులు తలుచుకుంటే ఏమైతుందో కేసీఆర్‌కు బాగా తెలుసు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు.
ప్రభుత్వాలేవయినా… వాటికి వచ్చే మంచి, చెడ్డ పేర్లన్ని ప్రభుత్వ ఉద్యోగులపై ఆధారపడి ఉంటాయి. అందుకే ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వాధినేతలు అంతలా మర్యాద ఇస్తారు. కానీ తెలంగాణ వచ్చాక ఉద్యోగ సంఘాల స్థాయి పడిపోతూ వచ్చింది. ఎంతలా అంటే… అసలు ఇన్ని సంఘాలు అవసరమా…? అంటూ ఆ మద్య ఉపాధ్యాయ సంఘాలపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. కానీ ఒక్క సంఘము పెద్దగా ఆ మాటలకు కౌంటర్ ఇవ్వలేకపోయింది. మొన్న ఆర్టీసీ యూనియన్లపై కూడా ఇదే తరహాలో మాట్లాడారు కేసీఆర్. యూనియనిజాన్ని తీసేస్తా అంటూ హెచ్చరించారు.
కానీ మొదట్లో ఆర్టీసీ యూనియన్లను తక్కువ అంచనా వేశారు కేసీఆర్. డెడ్‌లైన్ పెట్టి మరీ బెదిరించారు. కానీ 50వేల మంది కార్మికులు కేసీఆర్‌కు భయపడలేదు సరికదా… రాష్ట్రంలోని ఇతర ఉద్యోగ సంఘాలను తమతో కలిసి రావాలని, పోరాటాన్ని ఉదృతం చేసేందుకు వ్యూహా రచన చేశారు. ఓవైపు ఉప ఎన్నిక మరోవైపు ఆర్టీసీ సమ్మె. పైగా ఉద్యోగ సంఘాలు ఏకమై… టీజెఎస్ నేత కోదండరాం చెప్పినట్లు సకలజన సమ్మె జరిగితే ఇంకేమయినా ఉందా… అందుకే కేసీఆర్ ముందు జాగ్రత్తపడ్డారు. కీలకమైన టీఎన్జీవో, ఎన్జీవో నేతలను పిలిపించుకొని… మీ ఇబ్బందులపై త్వరలో ఓ మీటింగ్ ఏర్పాటు చేసుకుందాం, ఎన్నికల కోడ్ అయిపోగానే… కలుద్దాం అంటూ ఆర్టీసీ యూనియన్ల వైపు వెళ్లకుండా ఎత్తుగడ వేశారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఉద్యోగులే కదా ఏం చేస్తారులే… అనుకున్నా, రాబోయే సునామి కేసీఆర్ కళ్లకు కనపడింది. అందుకే వెంటనే ఉద్యోగ సంఘాలను పిలుచుకున్నారు. కానీ కార్మికులం అంతా ఒకే మాటపై ఉంటాం… వారు ఆర్టీసీ అయినా, సింగరేణి అయినా… రాష్ట్రంలో ఇతర ఉద్యోగులు అయినా. అందరి కష్టాలు ఒక్కటే అంటున్నారు ఆర్టీసీ కార్మికులు.