ఎనిమిదో నిజాం నవాబు ఉస్మాన్ అలీ ఖాన్ ముకరమ్ ఝా బహదూర్ శనివారం కన్నుమూశారు. రాత్రి 10.30 గంటలకు టర్కీలోని ఇస్తాంబుల్ లో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన కుటుంబం తరపున హైదరాబాద్ లోని కార్యాలయం ఈ మేరకు ఓ ప్రకటనను జారీ చేసింది.
ఎనిమిదో నిజాం నవాబు ముకరమ్ ఝా మృతికి సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నిజాం వారసుడిగా విద్య, వైద్య రంగాల్లో పేదల కోసం సామాజిక సేవ చేశారని కొనియాడారు. అధికారిక లాంఛనాలతో ముకరమ్ ఝా అంత్యక్రియలు నిర్వహించాలని సీఎస్ శాంతికుమారికి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
ముకరమ్ ఝా పార్థివ దేహం హైదరాబాద్ కు చేరుకున్న అనంతరం వారి కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు అంత్యక్రియల సమయాన్ని, స్థలాన్ని నిర్థారించి తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
కాగా ముకరమ్ ఝా మృతిపై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రభుత్వ పరంగా అంత్యక్రియలు నిర్వహించి జనవరి 17న అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
ముకరమ్ ఝా అసలు పేరు మీర్ బర్కత్ అలీ ఖాన్. మీర్ హిమాయత్ అలీ ఖాన్ వురపు అజం జా బహదూర్, ప్రిన్సెస్ డుర్రు షెవర్ దంపతులకు ముకరమ్ ఝా జన్మించారు. ఆయన 1933 అక్టోబరు 6న జన్మించారు. ప్రిన్సెస్ డుర్రు షెవర్ టర్కీ చిట్ట చివరి సుల్తాన్ కుమార్తె. ఆమె దాదాపు 20 ఏళ్ళ క్రితం మరణించారు.