కేంద్రంపై యుద్ధమంటూ కారాలు, మిరియాలు నూరుతున్న కేసీఆర్.. మళ్లీ ప్రతిపక్ష పార్టీలతో భేటీలు స్టార్ట్ చేశారు. ఆదివారం స్పెషల్ ఫ్లైట్ లో ముంబై వెళ్తున్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేతో భేటీ కానున్నారు. ఇటీవల కేసీఆర్ కు ఫోన్ చేసిన థాక్రే.. తన మద్దతు ప్రకటించారు. ముంబై రావాలని కోరారు. ఆయన ఆహ్వానం మేరకు ఆర్థిక రాజధానికి పయనం అవుతున్నారు కేసీఆర్.
ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరతారు కేసీఆర్. ఒంటి గంటకు ఉద్దవ్ థాక్రేతో సమావేశం కానున్నారు. కేసీఆర్ తో పాటు ఆయన వెంట వెళ్లే టీంను థాక్రే భోజనానికి ఆహ్వానించారు. జాతీయ రాజకీయాలు, దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలు, భవిష్యత్ కార్యాచరణ సహా తదితర అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు.
రెండు రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని పాలనాపరమైన అంశాలపై కూడా కేసీఆర్, థాక్రే మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఉద్ధవ్ థాక్రేతో సమావేశం తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలవనున్నారు కేసీఆర్. జాతీయ రాజకీయ అంశాలపై చర్చించనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ కు తిరిగి వస్తారు కేసీఆర్.
మోడీ సర్కార్ ని కూల్చేస్తామని చాలా గ్యాప్ తర్వాత ఈమద్యే ప్రకటించిన కేసీఆర్.. అటు మమతా బెనర్జీ, స్టాలిన్ తో టచ్ లో ఉన్నారు. థాక్రేతో భేటీ తర్వాత ఇంకొంత మంది నాయకులను ఆయన కలుస్తారని తెలుస్తోంది.