తెలంగాణ సీఎం కేసీఆర్ ముంబై బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్ ప్రగతిభవన్ నుంచి బయల్దేరిన ఆయన.. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేతో సమావేశం కానున్నారు. ఇటీవల కేసీఆర్ కు ఫోన్ చేసిన థాక్రే.. కేంద్రంపై యుద్ధం విషయంలో తన మద్దతును ప్రకటించారు. ముంబై రావాలని కోరారు. ఆయన ఆహ్వానం మేరకు ఆర్థిక రాజధానికి వెళ్లారు కేసీఆర్.
ఒంటి గంట తర్వాత ఉద్దవ్ థాక్రేతో సమావేశం కానున్నారు కేసీఆర్. జాతీయ రాజకీయాలు, దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలు, భవిష్యత్ కార్యాచరణ సహా తదితర అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు.
రెండు రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని పాలనాపరమైన అంశాలపై కూడా కేసీఆర్, థాక్రే మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఉద్ధవ్ థాక్రేతో సమావేశం తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలవనున్నారు కేసీఆర్. జాతీయ రాజకీయ అంశాలపై చర్చించనున్నారు.
దేశ రాజకీయ పరిణామాలు, బీజేపీ పాలన, ప్రజావ్యతిరేక విధానాలు, దేశానికి జరుగుతున్న నష్టం వంటి అంశాలు కేసీఆర్, పవార్ మధ్య చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.