జీహెచ్ఎంసీ మేయర్ పదవి ఎవరికి దక్కుతుందన్న దానిపై ఉత్కంఠ పెరిగిపోతోంది. సీఎం కేసీఆర్ మనసులో ఎవరున్నారు? సీల్డ్ కవర్‌లో ఎవరి పేరు రాశారన్నది ఎంతకీ, ఎవరికీ అంతుబట్టడం లేదు. ఏ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని మేయర్ అభ్యర్థిని కేసీఆర్ ఖరారు చేసి ఉంటారా అన్నదానిపై విశ్లేషకులు తలో లెక్క వేస్తున్నారు. ఎన్నికకు ముందు మాత్రమే వారి పేర్లను వెల్లడిస్తామని స్పష్టం చేయడంతో.. ఆశావహులు ఊపిరిబిగపట్టి చూస్తున్నారు.
మరోవైపు మేయర్ అభ్యర్థిగా గతంలో తెరపైకి వచ్చిన పేర్లు తప్పా.. కొత్తగా మరేవరి పేర్లూ వినిపించలేదు. దీంతో ఊహించిన వారిలోనే ఎవరో ఒకరికి మేయర్ పీఠం దక్కుతుందా.. లేక అంచనాలకు అందని విధంగా కొత్తవారికి కట్టబెడతారా అన్న సస్పెన్స్ నెలకొంది. ప్రస్తుతానికైతే మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి, రాజ్యసభ ఎంపీ కేకే కూతురు విజయలక్ష్మి, పీజేఆర్ కుమార్తె విజయారెడ్డితో పాటు విజయశాంతి, పూజిత గౌడ్, కవితారెడ్డి, సింధురెడ్డి, మోతె శ్రీలత పేర్లు వినిపిస్తున్నాయి.అయితే ఇందులో చాలా మందిలో.. వారి వారి కుటుంబ సభ్యులు ఇప్పటికే వివిధ పదవుల్లో ఉండటం వారికి మైనస్‌గా మారే అవకావశముందని అంటున్నారు. అటు ఇప్పటికే ఈసారి సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకోవడం కాకుండా.. సమర్థులకే మేయర్ పదవి ఇస్తారని సంకేతాలివ్వడంతో ఎవరికి ఆ అదృష్టం దక్కుతుందన్నది ఏమాత్రం అంచనాలకు అందడం లేదు.
ఇక డిప్యూటీ మేయర్ విషయానికి వస్తే మరోసారి బాబా ఫసియుద్దీన్‌నే వరిస్తుందని అందరూ అనుకుంటున్నారు. అయితే ఆయన కాని పక్షంలో జగదీశ్వర్‌గౌడ్, షేక్ హమీద్, సబీహాబేగం, ఎం.నరసింహయాదవ్ పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.