కరోనా సెకెండ్ వేవ్ నుంచి తెలంగాణను కాపాడుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి పిలుపునిచ్చారు. విధిగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని..వీలైనంత వరకు గుంపులుగా ఉండొద్దంటూ జనానికి సూచించారు. కరోనా కట్టడికి ఎంత ఖర్చుకైనా ప్రభుత్వం వెనుకాడబోదని పాత మాటలనే రిపీట్ చేశారు. కేసీఆర్ సూచనలు బాగానే ఉన్నాయి కానీ గ్రేటర్ ఎన్నికల్లో ఆ పార్టీ నేతలే వాటికి తూట్లు పొడుస్తున్నారు.
చోటా, మోటా లీడర్లు కూడా వందల కొద్ది జనాన్ని వెంటేసుకొని ఓట్లను అభ్యర్థించేందుకు వెళ్తున్నారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు పెడుతున్న సభలకైతే వేలకొద్ది జనాలని రప్పిస్తున్నారు. అందులో మాస్క్ లేకుండా వచ్చే వారు ఎంతో మంది.. ఇక సోషల్ డిస్టన్స్ సంగతి దేవుడే ఎరుగు. అలాంటిది రాష్ట్రమంతా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్న కేసీఆర్.. గ్రేటర్ ఎన్నికల్లోనూ ఇవే రూల్స్ పాటించాలని మాట మాత్రానికైనా చెప్పకపోవడం విచిత్రంగా ఉందని సాధారణ జనం చెప్పుకొంటున్నారు.