పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయం అధికార టీఆర్ఎస్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. నిరుద్యోగుల నుంచి నిలదీతలు, ఉద్యోగ వర్గాల నుంచి ప్రశ్నలే తప్ప ఓట్లు పడే అవకాశాలు కనిపించకపోవడంతో అధికారికంగానే ప్రలోభాల పర్వానికి తెరతీసింది. ఎన్నికలకు మరో 4 రోజులు ఉండగా.. వారి కరుణ, కటాక్షాల కోసం కాళ్లబేరానికి వచ్చింది. అత్యవసరంగా ఆయా సంఘాలతో సమావేశమై.. వారి డిమాండ్లకు తలొగ్గింది. విధిలేని పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 29 శాతం ఫిట్‌మెంట్‌తో పాటు పదవీ విరమణ వయసు 58 నుంచి 61 ఏళ్లకు పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చివరకు అంగీకరించాల్సి వచ్చింది. ఈ నెల 18న ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్‌లో కూడా చేరుస్తామంటూ వారిని బుజ్జగించే ప్రయత్నం చేసింది. మొత్తానికి ఏళ్ల తరబడి పెండింగ్‌లో పడిపోయిన పీఆర్సీ ఇష్యూ..ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా చిటికెలో పరిష్కారమైపోయింది.
ఉద్యోగ వర్గాలనే కాదు నిరుద్యోగులను కూడా బుట్టలో వేసుకునే ప్రయత్నాలను కూడా అధికార పార్టీ ముమ్మరం చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే 50 వేల ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ వస్తుందంటూ మంత్రి కేటీఆర్ తాజాగా ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఎప్పుడో ఉద్యోగాల భర్తీ ప్రకటన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి.. మధ్యలో రెండు నెలల సమయం ఉన్నా కనీసం ఏయే శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా ప్రకటించలేకపోయింది. ఇప్పటికి ఆ వివరాలపై స్పష్టతే లేదు. కానీ ఎమ్మెల్సీ కోడ్ ముగిసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుందంటూ కేటీఆర్ కొత్త రాగం అందుకున్నారు. ఉద్యోగులతో రాజీ కుదిరంది.. ఇక నిరుద్యోగులను కాక పట్టేందుకు ఈ నాలుగు రోజుల్లో ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు చేస్తుందో చూడాలి అంటూ పట్టభద్రులు సెటైర్లు వేస్తున్నారు.