– కేంద్రంపై వార్ కి పిలుపునిచ్చిన కేసీఆర్
– పలు పార్టీల నేతలకు ఫోన్లు
– ఇప్పటికే అనేక విషయాల్లో సారుకు షాకులు
– మరి.. కలిసి వచ్చేదెవరు?
– బీఆర్ఎస్ అయోమయంలో ఉన్న సారు వెంట నడిచేదెవరు?
కేంద్రంపై యుద్ధం.. కేసీఆర్ పదే పదే చెప్పేదే. ఆయన చేసే యుద్ధమేంటో.. జనాలు కూడా చూస్తూనే ఉన్నారు. మీడియా ముందుకొచ్చినప్పుడు, మీటింగులు జరిగినప్పుడు చెడామడా కేంద్రాన్ని తిట్టేయడమే యుద్ధం అనే భ్రమలో కేసీఆర్ ఉన్నారని అనుకుంటున్నారు. ఇన్నేళ్లలో ఆయన చేసిన యుద్ధం తీరు అలా ఉండబట్టే ప్రజలు కూడా అలా ఆలోచిస్తున్నారని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. ఇప్పుడు మరోసారి కేంద్రంపై యుద్ధానికి పిలుపునిచ్చారు కేసీఆర్. అయితే.. ఈసారి పార్లమెంట్ ను వేదికగా చేసుకుంటున్నారు. తమ ఎంపీలు పోరాటం చేస్తారు.. మీరు మద్దతు ఇవ్వండి అంటూ పలు పార్టీల నేతలకు ఫోన్ చేశారు.
కేంద్రం అనుసరిస్తున్న అసంబద్ధ వైఖరిపై సమరశంఖం పూరిద్దామని పిలుపునిచ్చారు కేసీఆర్. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని.. దీనిపై పోరాటం చేద్దామని కోరారు. దీనికోసం పార్లమెంట్ సమావేశాలను వేదికగా చేసుకుందామని సూచించారు. అయితే.. ఇక్కడ చర్చకు దారి తీసిన అంశం ఏంటంటే.. కేసీఆర్ ఇచ్చిన పిలుపును ఎవరు ఫాలో అవుతారన్నదే. ఎందుకంటే.. ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తాను, హైదరాబాద్ లో మీటింగ్ పెడతాను అని.. ఆయన గతంలో అనేక బీరాలు పలికారు. తీరాచూస్తే ఆ విషయంలో ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. పోనీ.. ప్రతిపక్ష పార్టీల మధ్య సఖ్యత ఉందా? అంటే అదీ లేదనే వాదన ఉంది.
బీజేపీయేతర పార్టీలు ఏకం కావాలంటే పెద్ద వింతే అనేది రాజకీయ పండితుల మాట. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా విపక్ష పార్టీల అభ్యర్థి ఎంపిక విషయాన్నే తీసుకోండి. మమతా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేసీఆర్ డుమ్మా కొట్టారు. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అనే చర్చ ఉంది. కాంగ్రెస్ తో పాటు వేదిక పంచుకోవడం ఇష్టం లేకే కేసీఆర్ వెళ్లలేదని టీఆర్ఎస్ వర్గాలు చెప్పుకున్నాయి. తీరా నామినేషన్ సమయంలో మాత్రం కేటీఆర్ ఢిల్లీ వెళ్లి మరీ విపక్షాల అభ్యర్థికే తమ మద్దతు అని రాహుల్ గాంధీకి దగ్గరలోనే కూర్చుకున్నారు. ఇది బీజేపీకి పెద్ద అస్త్రంగా మారింది. ఆ రెండు పార్టీలు ఒకటే అని బలంగా చెబుతోంది. ఈ విషయం అటుంచితే.. జాతీయ రాజకీయాల మంత్రం జపిస్తున్న కేసీఆర్.. కాంగ్రెస్ కూటమిలో కలుస్తారా? లేదా? అనేది పెద్ద ప్రశ్న అని చెబుతున్నారు విశ్లేషకులు.
కొన్నాళ్ల నుంచి కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ అంటూ అనేక లీకులు ఇచ్చారు. ప్రకటన అదిగో, ఇదిగో అంటూ వార్తలు వచ్చాయి. కానీ.. ఈ విషయంలో సారు సైలెంట్ అయిపోయారు. మేం జాతీయ రాజకీయాలు చేయకూడదా అని చెబుతూనే ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. ఏం చేయాలో అనే అయోమయంలో కేసీఆర్ ఏదిబడితే అది చేస్తున్నారని విశ్లేషకులు వివరిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఎన్డీఏకే మద్దతుగా నిలిచాయి. వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ ను, ఇతర రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తున్న టీఎంసీనే కాదని ముర్ముకు జై కొట్టారు. రాష్ట్రపతి ఎన్నికలు వేరు.. అనే ఆన్సర్ వచ్చినా.. ఇప్పుడే ఒకతాటిపై రాలేదు.. రానున్న రోజుల్లో జట్టుగా ఎలా నిలబడతాయనేది విశ్లేషకుల ప్రశ్న. అలాంటప్పుడు కేసీఆర్ మాటను ఇతర పార్టీలు వింటాయా? లేదా? అనేది చూడాలంటున్నారు. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు అనగానే ఎవరి రాష్ట్రంలో వారి సమస్యలను ఏకరువు పెట్టడం కామన్. పైగా తాజాగా పార్లమెంట్ రూల్స్ ను మార్చారు. ఎలాబడితే అలా ధర్నాలు, నిరసనలకు ఛాన్స్ లేదు. ఇలాంటప్పుడు కేసీఆర్ మాటను ఎన్ని పార్టీల అధినేతలు వింటారనేది చూడాలంటున్నారు విశ్లేషకులు.