తెలంగాణలో గ్రామ రెవెన్యూ అధికారి వ్యవస్థను ప్రభుత్వం తొలగించింది. రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తున్నామని… వారిని ఇతర శాఖల్లో వినియోగించుకుంటామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు.
రాష్ట్రంలో భూముల పంచాయితీకి తెర దించాలన్న ఉద్దేశంతోనే కొత్త చట్టం తెస్తున్నామని… ఇన్నాళ్లుగా పట్టా భూములకు మాత్రమే ఉన్న పాస్ పుస్తకాలను ఇప్పుడు నాన్ అగ్రికల్చర్, ప్లాట్స్, హౌజ్, ఫ్లాట్స్ కు కూడా ఇవ్వబోతున్నామని ప్రకటించారు. తెలంగాణ భూ పరిపాలనలో ఇక ధరణి వెబ్ సైట్ కీలకం అవుతుందని… నాన్ అగ్రికల్చర్, అగ్రికల్చర్ కు ప్రత్యేకంగా వెబ్ సైట్స్ ఉంటాయని ప్రకటించారు.
తెలంగాణలో భూముల సర్వే చేపట్టనున్న నేపథ్యంలో… సాధా బైనామాలతో రిజిస్ట్రేషన్లు, మరోసారి భూములు, భవనాలను రెగ్యూలరైజ్ చేసేందుకు తెచ్చిన 58,59 జీవోలను మరోసారి తెస్తామని సీఎం సభకు హమీ ఇచ్చారు. ఇక దేవాలయాలు, వక్ఫ్ బోర్డు సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్లు లాక్ చేస్తున్నామని, అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటానని సభకు హామీ ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
జాయింట్ సబ్ రిజిస్ట్రారర్ హోదా ఎమ్మార్వోలకు ఇచ్చి రిజిస్ట్రేషన్ అధికారం ఇచ్చినందున… ఎవరైనా అధికారులు తమ పరిధి దాటితే సర్వీసు నుండి తొలిగించే అధికారం ఈ చట్టం ద్వారా ప్రభుత్వానికి ఏర్పడుతుందన్నారు. గిరిజనులకు ఇచ్చే పోడు భూములపై హక్కుల విషయంలో న్యాయం చేస్తామన్నారు.