మజ్లిస్‌తో కలిసేదే లేదు.. అసలు మా ప్రత్యర్థినే మజ్లిస్’ అంటూ టీఆర్ఎస్.., ‘ఎంఐఎం దయాదక్షిణ్యాల మీదే ఏ ప్రభుత్వమైనా నడవాల్సిందే, టీఆర్ఎస్ అందుకు మినహాయింపు కాదు’ అంటూ మజ్లిస్.. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో వీరోచితంగా ఒకదానిపై ఒకటి విరుచుకుపడ్డాయి. కానీ చివరికి మజ్లిస్ చెప్పిన మాటే నిజమైంది. ఆ పార్టీ దయాదక్షిణ్యాల మీదే టీఆర్ఎస్‌కు గ్రేటర్ పీఠం సాధించుకునే పరిస్థితి వచ్చింది. అయితే అదే జరిగితే అధికారం దక్కొచ్చుకానీ… ఇప్పటిదాకా మజ్లిస్‌పై తాము చేస్తూ వచ్చిన ఆరోపణలన్నీ కూడా ఉత్తవేనన్న అపవాదును టీఆర్ఎస్ మూటగట్టుకోవాల్సి వస్తుంది. ముందు నుయ్యి.. .వెనక గొయ్యిలా మారిన ఈ పరిస్థితిలో మేయర్ పదవి దక్కించుకోవడానికి టీఆర్ఎస్ అనుసరించే వ్యూహం ఎలా ఉండబోతుందన్నది రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతం 150 మంది కార్పొరేటర్లతోపాటు 45 మంది ఎక్స్‌అఫిషియో సభ్యులున్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం మేయర్ స్థానాన్ని దక్కించుకోవడానికి ఏ పార్టీకైనా 98 ఓట్లు అవసరం. కార్పొరేటర్లు, ఎక్స్‌అఫిషియో సభ్యులు కలిపి ప్రస్తుతం టీఆర్ఎస్‌కు 87 మంది ఉన్నారు. దీంతో ఎన్ని ప్రయత్నాలు చేసినా సొంతంగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశాలు ఆ పార్టీకైతే కనిపించడం లేదు. దీంతో అనివార్యంగా మజ్లిస్ మద్దతు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
మరోవైపు మజ్లిస్‌తో నేరుగా కలిస్తే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉండటంతో.. ఆ పార్టీ సాయంతోనే ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నట్టుగా ప్రచారం జరగుతోంది. మేయర్ ఎన్నిక జరిగే రోజు మజ్లిస్ సభ్యులు ఓటింగుకు గైర్హాజరయితే మేయర్ పదవి టీఆర్ఎస్‌కు దక్కే చాన్స్ కనిపిస్తోంది. దీంతో ఆ దిశగా అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది.