మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు గెలిచి తీరాల్సిందేనని… ఏ ఒక్కటి ఓడినా మంత్రి పదవులు పోతాయని హెచ్చరించారు. మున్సిపల్ గెలుపు బాధ్యత జిల్లా మంత్రులదేనని, ఆయా నియోజవర్గ ఎమ్మెల్యేలంతా బాధ్యత తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.
తెలంగాణ భవన్‌లో పార్టీ నేతల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన, సర్వేలన్నీ పార్టీ గెలుపునే సూచిస్తున్నాయని, బీజేపీ మనకు పోటీయే కాదని… అపోహలు వద్దంటూ నేతల్లో దైర్యం నింపే ప్రయత్నం చేశారు కేసీఆర్. గెలిచే అభ్యర్థులు ఎవరు, పార్టీ ప్రచారం ఎలా ఉంటుంది, అసంతృప్తుల బుజ్జగింపుల బాధ్యత ఆయా నియోజవకర్గాల ఎమ్మెల్యేలేదనని, పాత-కొత్త నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆదేశించారు.
ఇక మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యేల పంచాయితీపై సీఎం ఆరా తీశారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడిన సీఎం… పార్టీ గెలుపు కోసం పనిచేయాలని కోరారు. తనకు టికెట్ నిరాకరించినా, మీ మీద నమ్మకంతోనే పార్టీ కోసం పనిచేస్తుంటే నా వర్గాన్ని, నన్ను మంత్రి మల్లారెడ్డి అణచివేస్తున్నారని సుధీర్ రెడ్డి సీఎంకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.