పరేడ్ గ్రౌండ్ లో జరగాల్సిన రిపబ్లిక్ డే వేడుకల్ని రాజ్ భవన్ కే పరిమితం చేసింది ప్రభుత్వం. అయితే.. సీఎం కేసీఆర్ మాత్రం పరేడ్ గ్రౌండ్ కు వెళ్లారు. రిపబ్లిక్ డే సందర్భంగా అక్కడ అమర జవాన్లకు నివాళులర్పించారు. స్థూపం వద్ద పుష్పగుచ్ఛం పెట్టి నివాళులర్పించారు సీఎం.
అంతకుముందు ప్రగతి భవన్ లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండా ఆవిష్కరించారు సీఎం కేసీఆర్. గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు నివాళులర్పించారు. జెండా ఆవిష్కరణలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
అసెంబ్లీలో జాతీయ జెండాను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలో ఉన్న మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పోచారం ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎవరి బాధ్యత ఏంటో చెప్పినదే రాజ్యాంగం అని తెలిపారు. స్పీకర్ అయినా, ప్రధాని అయినా రాజ్యాంగం పరిధిలోనే పదవులు వచ్చాయని గుర్తు చేశారు.
కొంతమంది కళ్లలో సంతోషం కోసం పరిపాలన చేయొద్దన్న పోచారం.. అది రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఇవాళ కొన్ని సంఘటనలు చూస్తుంటే బాధేస్తోందని.. పేదోదు పేదోడిగానే ఉన్నాడని చెప్పారు. దేశ సంపద కొంత మంది చేతుల్లోనే ఉందన్నారు. పేదలకు పెద్ద పీట వేయాలన్న ఆయన.. కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందుతోందని చెప్పారు.