తెలంగాణలో బీజేపీ దూకుడు మీదుంది. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల అద్భుత ఫలితాలు రాబట్టి టీఆర్ఎస్ ను ఇరుకున పెడుతుంది. మరోవైపు ఇతర పార్టీల్లో ఊగిసలాటల్లో ఉన్న నేతలకు పార్టీ కండువా కప్పేస్తుంది. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ తన పార్టీలో ఉన్న నేతలపై ఫోకస్ చేసినట్లు కనపడుతుంది.
సీఎం కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవుల భర్తీ జోలికి పోలేదు. అత్యవసరం అనుకున్న ఒకటి రెండు పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. పైగా కీలకమైన పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ పోస్టు ఖాళీ కానుంది. మహిళా కమిషన్ ను నియమించాలని కోర్టు ఇప్పటికే ఆదేశించింది. వీటితో పాటు ఇతర కార్పోరేషన్ల చైర్మన్ పోస్టుల కోసం చాలా మంది నేతలు ఎదురుచూస్తున్నారు.
బీజేపీ మరింత దూకుడు పెంచి, తమ నేతలపై ఫోకస్ చేయకముందే… నామినేటెడ్ పోస్టులను పంచాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పలువురు నాయకులు, రిటైర్డ్ అధికారులంతా ఈ పదవుల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. దీంతో వారికి వెంటనే పదవులు అప్పజెప్పాలని, జనవరి రెండో వారంలో ప్రకటన చేసేందుకు వీలుగా జిల్లాల వారీగా నేతల ప్రొఫైల్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.