– హరీష్, తలసాని బాటలో కేటీఆర్
– తెలంగాణ, ఏపీని కలిపేస్తారని కామెంట్
– ఇది సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం కాదా?
– నిజంగా తెలుగు రాష్ట్రాలు మళ్లీ కలుస్తాయా?
– అసలు.. అది కుదిరే పనేనా?
టీఆర్ఎస్ పార్టీకి సెంటిమెంట్ ను మించిన అస్త్రం లేదనేది రాజకీయ పండితుల మాట. ఉద్యమం సమయం నుంచి ఇప్పటిదాకా ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతూ కేసీఆర్ నెట్టుకొస్తున్నారని చెబుతుంటారు. ఇటీవలి కాలంలో సెంటిమెంట్ పాలిటిక్స్ తగ్గాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతుండగా.. పార్లమెంట్ లో ప్రధాని మోడీ వ్యాఖ్యలతో మరోసారి ఆ అస్త్రాన్ని కేసీఆర్ ప్రయోగిస్తున్నట్లుగా కనిపిస్తోందని చెబుతున్నారు.
బీజేపీ గెలిస్తే ఏపీ, తెలంగాణను మళ్లీ కలిపేస్తారన్న ప్రచారాన్ని టీఆర్ఎస్ గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ ఏ మీటింగ్ కు వెళ్లినా ఇదే అంశాన్ని లేవనెత్తుతున్నారు. ప్రజలకు పదే పదే దీనిపై చెబుతూ సెంటిమెంట్ వర్కవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు మరో మంత్రి కేటీఆర్ కూడా అదే రాగం అందుకున్నారని చెబుతున్నారు.
నిజామాబాద్ లో పర్యటించిన కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నరేంద్ర మోడీకి ప్రధానిగా మరో అవకాశమిస్తే తెలంగాణ, ఆంధ్రాను కలిపేస్తారని అన్నారు. దేశం కోసం ధర్మం అని చెప్పే బీజేపీ సర్కార్.. దేశానికి ఏం చేస్తుందో మాత్రం చెప్పదని వ్యాఖ్యానించారు. మోడీ కేవలం నార్త్ ఇండియాకు మాత్రమే ప్రధాన మంత్రిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
పార్లమెంట్ లో రాష్ట్ర విభజనపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల తర్వాత… టీఆర్ఎస్ వర్గాల నుంచి ఎదురుదాడి ఎక్కువైంది. రాష్ట్రవ్యాప్తంగా దిష్టిబొమ్మ దహనాలు చేశారు గులాబీ నేతలు. సీఎం కేసీఆర్.. జనగామ, భువనగిరి సభల్లో, ప్రెస్ మీట్లలో కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీ కోటను బద్దలు కొడతానని చెబుతున్నారు. జాతీయ రాజకీయాలపై కన్నేసిన కేసీఆర్.. ప్రజా ఫ్రంట్ అని అంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో టీఆర్ఎస్ నేతలు తెలంగాణను, ఏపీని కలిపేస్తారనే ప్రచారం మొదలెట్టారు. సెంటిమెంట్ ను రగిలించి లాభం పొందడమే దీని వెనుక వ్యూహం అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు రాజకీయ పండితులు. ఈ నేపథ్యంలో అసలు.. రాజ్యాంగబద్దంగా విడిపోయిన రాష్ట్రాలు మళ్లీ కలుస్తాయా? అనే ప్రశ్న తలెత్తుతోంది.