దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత బీజేపీ అంటే టీఆర్ఎస్, కేసీఆర్ మండిపడుతున్నారు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ పై టీఆర్ఎస్ ఒంటికాలిపై లేస్తుంది. అందుకే రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు టీఆర్ఎస్ వెంటనే మద్దతు ప్రకటించి, తమ శ్రేణుల్ని బీజేపీకి వ్యతిరేకంగా రోడ్లపైకి పంపింది.
కానీ హాఠాత్తుగా సీఎం కేసీఆర్… మోడీ సర్కార్ ను అభినందిస్తూ ప్రధాని మోడీకి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నూతన పార్లమెంట్ భవన నిర్మాణం, కార్యాలయాల నిర్మాణంకు సంబంధించిన పనులు ప్రారంభించటాన్ని స్వాగతిస్తున్నామని, భారత దేశ చరిత్రను ప్రతిబింబించే విధంగా నిర్మాణాలుండాలని లేఖలో కోరారు. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని కేసీఆర్ మోడీని కోరారు.
ఓవైపు కేంద్రం, బీజేపీపై కేసీఆర్ విరుచుకుపడుతూనే… ఇప్పుడు పొగుడుతూ లేఖ రాయటం వెనుక ఏంటీ అసలు కథ అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. బీజేపీతో ఢీ కొట్టలేమని అర్థం అయి ఇలా కాళ్ల బేరానికి వచ్చారా…? లేక మరేదైనా కారణం ఉందా…? అని చర్చించుకుంటున్నారు. అయితే, రాష్ట్రంలో పాత సచివాలయాన్ని కూల్చి కొత్త సచివాలయ నిర్మాణ పనులు మొదలు కాబోతున్నాయి. ఇలాంటి సమయంలో సహాజంగానే బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టే అవకాశం ఉంది. సచివాలయానికి రాని ముఖ్యమంత్రికి కొత్త సచివాలయం ఎందుకు అని ప్రశ్నిస్తారన్న అంచనా నేపథ్యంలో ప్రధాని మోడీ నిర్మిస్తున్న కొత్త నిర్మాణాన్ని స్వాగతించటం ద్వారా రాష్ట్ర బీజేపీ నాయకుల నోటీకి తాళం వేసే వ్యూహత్మక ఎత్తుగడ ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేసీఆర్ స్ట్రాటజీని బీజేపీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.